Priyansh Arya Creates T20 History: భారత ఆటగాడు, ఢిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు చేశాడు. దీంతో పురుషుల టీ20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది రెండో అత్యధిక స్కోరు. దక్షిణాఫ్రికా ఆటగాడు లుహాన్-డ్రే ప్రిటోరియస్ గత నెలలో చేసిన 188 పరుగుల రికార్డుకు ఆర్య కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచాడు.
18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..
ఇండోర్‌లోని డాలీ కాలేజ్ గ్రౌండ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆర్య మెరుపు ఆరంభాన్ని అందించాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఆర్య కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 36 బంతుల్లోనే తన మూడో టీ20 సెంచరీ సాధించాడు. మరో 24 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు.
క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
సిద్ధార్థ్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టిన ఆర్య.. టీ20ల్లో క్రిస్ గేల్ చేసిన 175 నాటౌట్ స్కోరును అధిగమించాడు. దాదాపు 13 ఏళ్ల పాటు గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును గత నెలలో ప్రిటోరియస్ బద్దలు కొట్టాడు. అలాగే 2021లో కిరణ్ నవ్‌గిరే చేసిన 76 బంతుల్లో 162 పరుగుల రికార్డును అధిగమించి.. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన రికార్డును ఫిన్ అలెన్‌తో కలిసి పంచుకుంటున్నాడు.
ఢిల్లీ భారీ స్కోరు..
ప్రియాంశ్ ఆర్య విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఇది సంయుక్తంగా మూడో అత్యధిక స్కోరు. ఈ టోర్నీలో ఢిల్లీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదుసార్లు 200కు పైగా పరుగులు చేసింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లోనే ఢిల్లీ ఓటమి పాలైంది. ప్రియాంశ్ ఆర్యను పంజాబ్ కింగ్స్ జట్టు IPL 2027 వేలానికి ముందు రిటైన్ చేసుకుంది. ఈ ఏడాది జరిగిన IPL 2026లోనూ అతడు వేగంగా పరుగులు సాధించే ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు.

