Site icon NTV Telugu

Priyanka Gandhi: హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంకగాంధీ.. స్వయంగా పిండి కలిపి..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్‌లో ఆమె సందడి చేశారు. మైసూరులోని మైలారి అగ్రహార రెస్టారెంట్‌​కు వెళ్లిన ప్రియాంక.. ఆ రెస్టారెంట్‌లోని కిచెన్‌లోకి వెళ్లి తన దోసెలు చేశారు. స్వయంగా పిండిని కలిపి.. గుండ్రటి దోసెలు వేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దోసెలు చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్న ప్రియాంక, “ఈ ఉదయం లెజెండరీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు చేయడం ఆనందించానని ఆమె తెలిపారు. నిజాయితీ, కష్టపడి పనిచేయడం వ్యాపారానికి చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు.

Read Also: Delhi Mayor Election: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్.. నామినేషన్ విత్‌డ్రా చేసుకున్న బీజేపీ..

ప్రియాంక గాంధీవెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా సహా పలువురు అగ్ర నేతలు కూడా హోటల్‌లో ఉన్నారు. ప్రియాంక రాకను చూసి హోటల్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రియాంకను ఆహ్వానిస్తూ.. ఆమె దోశలు వేయడాన్ని ఆసక్తిగా తిలకించారు. దోసెలు వేసిన తర్వాత రెస్టారెంట్‌​కు వచ్చిన కస్టమర్లతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. చిన్నారులతో కలిసి సరదాగా మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు అదే హోటల్‌లో టిఫిన్ చేశారు. ప్రియాంక సహా నేతలంతా ఇడ్లీలు ఆరగించారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్ చేసింది.

 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మైసూరులో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో తరచుగా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు రానున్నాయి.

Exit mobile version