Priyanka Gandhi Husband Robert Vadra on Amethi: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయడం దాదాపు ఖాయం అయింది. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని రాబర్ట్ వాద్రా అన్నారు. సోమవారం యూపీలోని పవిత్ర నగరమైన బృందావన్‌ని సందర్శించి.. లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న అనంతరం రాబర్ట్ వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చినా.. ఆయన వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది.
రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ… ‘నేను రాజకీయాల్లోకి వస్తా. దేశంలో మార్పు వాతావరణం నెలకొంది. మా కుటుంబం మొత్తం శ్రద్ధగా పని చేస్తుంది. నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా.. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా. దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటా. అమేథీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని దేశంలోని ప్రతి మూలలో చర్చలు జరుగుతున్నాయి. ఇది ప్రజల పిలుపు. వారి కష్టాన్ని నేను అర్థం చేసుకున్నా. నేను వారికి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్లి సమస్యలు వినాలని కోరుకుంటున్నారు. అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కలిగి ఉన్నా. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతం తొందరపడటం లేదు’ అని అన్నారు.
Also Read: Dinesh Karthik Six: దినేష్ కార్తీక్ భారీ సిక్స్.. స్టేడియం బయట బంతి! వీడియో వైరల్
‘ఓ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి స్మరించుకుంటాడు. కష్టాల్లో ఉన్న వ్యక్తి భగవంతుడిని స్మరించుకుంటే ధైర్యం పెరుగుతుంది. అందుకే మతం పేరుతో వివక్ష రాజకీయాలు చేయకూడదు. బీజేపీ వివక్ష రాజకీయాలు చేస్తున్న పార్టీ. ఇండియా కూటమిని గెలిపించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కష్టపడుతున్నారు. రాబోయే కాలంలో దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. దేశాన్ని సెక్యులర్‌గా ఉంచుతాం’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి కూడా బీజేపీ స్మృతి ఇరానీనే పోటీకి దింపింది.