Site icon NTV Telugu

Travel Bus Charges: వరుస సెలవులు.. భారీగా పెరిగిన ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు..!

Private Travels

Private Travels

సామాన్యుడికి సొంతూరి ప్రయాణం భారంగా మారుతోంది. వరుస సెలవులు రావడంతో నగరాల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు దీనిని అదునుగా చేసుకుని ఛార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి.

వరుస సెలవుల ‘క్యాష్’ పాలిటిక్స్
ఈ వారం మార్చి 19న ఉగాది, 21న రంజాన్, 22న ఆదివారం కావడంతో మధ్యలో ఉన్న శుక్రవారం ఒక్క రోజు సెలవు పెడితే వరుసగా నాలుగు రోజులు పండుగను కుటుంబంతో గడపవచ్చని చాలామంది ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడో నిండిపోవడంతో ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే ప్రత్యామ్నాయంగా మిగిలాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని సంస్థలు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.

సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సు ఛార్జీ సుమారు రూ. 1,500 నుంచి రూ. 2,000 మధ్య ఉంటుంది. కానీ ఈ లాంగ్ వీకెండ్ దృష్ట్యా కొన్ని ట్రావెల్స్ ధరలను ఏకంగా 3 నుంచి 4 రెట్లు పెంచేశాయి. నాన్ ఏసీ స్లీపర్ సీట్లకు కొన్ని ప్రముఖ ట్రావెల్స్ సంస్థలు ఒక వ్యక్తికి ఏకంగా రూ. 4,999 నుంచి రూ. 5,700 వరకు వసూలు చేస్తున్నాయి. ఏసీ స్లీపర్‌కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సర్వీసుల్లో కూడా టికెట్ ధర రూ. 5,300 దాటిపోయింది.

Also Read:CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సుల ఛార్జీలు కూడా గణనీయంగా పెరిగాయి. పండుగ రద్దీని బట్టి సాధారణ ధర కంటే రూ. 1,000 నుంచి రూ. 1,500 అదనంగా వసూలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో నిరసనలు..
పెంచిన ధరలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘విమాన ప్రయాణం కంటే బస్సు టికెట్ ధరలే ఎక్కువగా ఉన్నాయని, ఇలాగైతే ఇంటికి వెళ్లడం కంటే నగరంలోనే ఉండిపోవడం మేలు’ అని నెటిజన్లు వాపోతున్నారు. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి, అధిక ధరలు వసూలు చేసే ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంటారు. కానీ.. ఇలాంటి ‘లాంగ్ వీకెండ్స్’ (వరుస సెలవులు) సమయంలో ప్రైవేట్ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు వీలైనంత వరకు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే అదనపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడం ద్వారా ఈ భారం నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.

Exit mobile version