NTV Telugu Site icon

Army Dog Kent: ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన జాగిలానికి శౌర్య అవార్డు..

Kent

Kent

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సిబ్బందికి 103 శౌర్య పురస్కారాలను ప్రకటించారు. ఇందులో నాలుగు కీర్తి చక్ర, 18 శౌర్య చక్ర అవార్డ్స్ ఉన్నాయి. ఇద్దరు వీర వైమానిక దళ సైనికులకు శౌర్యచక్ర, ఆరుగురు సైనికులకు వాయుసేన పతకం లభించాయి. మరణానంతరం 9 మందికి పురస్కారాలను ప్రకటించారు. అయితే.. రాష్ట్రపతి పురస్కారాలను ప్రకటించిన దానిలో ఒక పేరు షాకింగ్‌గా ఉంది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులపై ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన కెంట్ అనే జాగిలానికి మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పురస్కారం ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 11న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ జాగిలం ప్రాణాలు కోల్పోయింది.

తొమ్మిది తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న కెంట్.. గత ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని నార్లా గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో తన హ్యాండ్లర్‌ను కూడా రక్షించింది. రాజౌరీ సెక్టార్‌లోని రోమియో ఫోర్స్‌కు చెందిన ఆర్‌ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జాగిలం ‘ఆపరేషన్ సుజలిగల’కు నాయకత్వం వహించింది. ఆర్మీ 21వ ఆర్మీ డాగ్ యూనిట్ (కె9)కి చెందిన ఆరేళ్ల లాబ్రడార్ కెంట్ మరణంపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ.. పారిపోతున్న ఉగ్రవాదులను వెంబడిస్తున్న సైనికుల బృందానికి జాగిలం నాయకత్వం వహించిందని తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో వారిపై దాడి చేసింది. ఆ సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిందని తెలిపారు.

Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు..

కెంట్ తన హ్యాండ్లర్‌ను కాపాడుతూ భారత సైన్యం యొక్క ఉత్తమ సంప్రదాయాలలో తన జీవితాన్ని త్యాగం చేసింది పేర్కొన్నారు. ఉగ్రవాదులతో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను వీరమరణం పొందగా, ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అదే సమయంలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కూడా హతమార్చాయి. కెంట్ విషాద మరణానికి అప్పటి ఉత్తర ఆర్మీ కమాండర్, ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంతాపం తెలిపారు. కెంట్ తన హ్యాండ్లర్‌ను రక్షించడానికి తన ప్రాణాలను ఇచ్చిందని చెప్పారు.

కెంట్ మరణంపై శిక్షణ వీడియోను విడుదల చేశారు. ఆర్మీ సైనికుడితో కలిసి నడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. కెంట్ తన లక్ష్యాన్ని సులభంగా సాధించగలదు.. పని పట్ల తనకున్న అంకితభావాన్ని చూపుతుంది. కెంట్‌కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతుండగా.. సైన్యం కెంట్ మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టి దానిపై పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. గోల్డెన్ కలర్ ట్రాకర్ కెంట్ ఆర్మీ నంబర్ 08B2 అని పేర్కొంటూ ఆర్మీ ప్రెస్ బ్రీఫ్ విడుదల చేసింది.