Site icon NTV Telugu

Bharat Jodo Yatra: జోడో యాత్రకు జోరుగా కసరత్తు.. డీజీపీని కలిసిన రేవంత్, భట్టి

Revanth Reddy

Revanth Reddy

Bharat Jodo Yatra: ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మీదుగా వెళ్లనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో రాహుల్‌ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌లను రేవంత్‌ రెడ్డి సిద్ధం చేశారు. పోలీసుల అనుమతి కోసం నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రెండు రూట్‌ మ్యాప్‌లను డీజీపీకి అందజేశారు. వీటిలో ఒకదానికి పోలీసులు అనుమతి ఇవ్వనున్నారు.

RTC MD Sajjanar: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ కారు.. సజ్జనార్‌కు స్వల్పగాయాలు

హైదరాబాద్‌లో భారత్ జోడో యాత్రకు సంబంధించి రెండు రూట్‌ మ్యాప్‌లను టీపీసీసీ ఖరారు చేయగా.. అందులో చార్మినార్ నుంచి గాంధీ భవన్‌, జూబ్లీహిల్స్ మీదుగా పటాన్‌చెరు చేరుకునేలా ఓ రూట్‌ మ్యాట్‌ను సిద్ధం చేశారు. రెండు రూట్ మ్యాప్‌లో శంషాబాద్‌ నుంచి రాజేంద్రనగర్‌, హెచ్‌సీయూ, బీహెచ్‌ఈఎల్‌ మీదుగా వెళ్లనుంది. ఈ రెండు రూట్‌ మ్యాప్‌లలో పోలీసులు ఒకదానికి అనుమతి ఇవ్వనున్నారు. యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేర కొనసాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Exit mobile version