కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని పీకే విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్ర తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయమని ఏ ఎన్నికల వ్యూహకర్త సలహా ఇచ్చారోనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయటం ఒక చెత్త నిర్ణయమని, అసలు ఈ సమయంలో యాత్ర చేపట్టడం సరికాదని ఓ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు ఇటువంటి యాత్ర నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యాత్ర కాకుండా.. బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఖరారు, భాగస్వామ్య పక్షాలు కలుపుకుపోవటం, ఎన్నికల కోసం వనరుల సేకరణ, రోజువారి సమస్యలకు పరిష్కారాలపై కసరత్తు చేయాల్సిందని సూచించారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఇప్పటికే చీలికలు వచ్చాయి. ఎవరికి వారే సీట్లు ప్రకటించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కూటమి ఎంత కాలం ఉంటోందనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల టైంకి ఏం జరుగుతుందో వేచి చూడాలి.