చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ.. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడు. అతను పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి ప్రసన్న శంకర్ నారాయణ.. ఇప్పుడు భార్య బాధితుడు అయ్యాడు. భార్య నుంచి విడాకుల గొడవతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఈ కేసులో చెన్నై సిటీ పోలీసుల తీరుపై ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులు.. వాటిని ప్రధాని మోడీకి ట్యాగ్ చేయటం సంచలనంగా మారింది.
ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. భార్య, కుమారుడు అమెరికా పౌరులుగా ఉన్నారు. భార్యభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే భరణం కింద నెలకు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వాలని భార్య దివ్య డిమాండ్ చేసింది. ఈ క్రమంలో.. దీనిపై చర్చలు నడుస్తున్నాయి. అయితే.. శంకర్ నారాయణ విడాకులకు దారి తీసిన వివాదాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాడు. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, దీనికి సంబంధించి రుజువులు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో.. తన భార్య దివ్య తన కొడుకును కిడ్నాప్ చేసినట్లు అమెరికాలో కేసు పెట్టిందని తెలిపాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు, కోర్టు.. ప్రసన్న శంకర్ నారాయణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనంతరం.. సింగపూర్‌లోనూ తన భార్య పోలీసులకు కంప్లైంట్ చేసిందని పేర్కొన్నాడు. అక్కడి పోలీసులు కూడా ప్రసన్న శంకర్ నారాయణకు క్లీన్ చీట్ ఇచ్చింది.
Read Also: Kerala: కేరళ బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్ నియామకం..
అయితే ఈ కేసుల వ్యవహారం విచారణ జరుగుతున్న క్రమంలోనే అమెరికా కోర్టు ఓ వెసులుబాటు కల్పించింది. ప్రతి వారం వీకెండ్ రోజు తన కొడుకుతో ప్రసన్న శంకర్ నారాయణ ఉండేందుకు అవకాశమిచ్చింది. దీంతో.. తన కొడుకును తీసుకుని అమెరికా నుంచి చెన్నై వచ్చింది భార్య దివ్య. మరోవైపు అమెరికా కోర్టు ఆదేశాల మేరకు శంకర్ నారాయణ స్నేహితుడి ద్వారా వీకెండ్‌లో తీసుకెళ్లాడు. దీంతో.. భార్య దివ్య తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ భర్త ప్రసన్న శంకర్ నారాయణపై చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకుని భర్త.. తన కుమారుడు తన వద్ద సంతోషంగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలో.. భార్య ఫిర్యాదుపై పోలీసులు FIR నమోదు చేయలేదు. అంతేకాకుండా.. శంకర్ నారాయణను పోలీసులు డబ్బులు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో.. తనను పోలీసులు రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఎక్స్ లో శంకర్ నారాయణ పోస్ట్ పెట్టాడు. దీంతో.. పోలీసులు సైతం ఈ విషయంలో చిక్కుకుపోయారు. శంకర్ నారాయణ లక్షల కోట్ల విలువైన కంపెనీలకు సహ వ్యవస్థాపకుడు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్త చెబుతున్నది నిజమా.. భార్య చెబుతున్నది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది.