Justice For Pranay: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధిత కుటుంబం భావోద్వేగంగా స్పందించింది. “జస్టిస్ ఫర్ ప్రణయ్” పేరుతో తాము చాలా కాలంగా పోరాటం చేశామని, ఇన్నాళ్లకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రణయ్ హత్య తర్వాత కూడా ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి. ఇలాంటి కులాంతర హత్యలు, కుల దురాంకర హత్యలు చేసేవారికి.. కన్న కూతురు, కన్న కొడుకులను చంపే వారికి ఈ తీర్పు కనువిప్పుగా మారాలని ప్రణయ్ కుటుంబం చెప్పింది.
Read Also: MLC Nominations: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం
చంపడం అనేది ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు. ఈ హత్యతో మా కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. అమృత భర్తను కోల్పోయింది, మేము మా కొడుకును కోల్పోయాం, మా మనవడికి తండ్రి లేకుండా పోయాడు. ఆరున్నరేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని వారు వెల్లడించారు. అలాగే ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు, అలాగే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయ వాదనలను సమర్థంగా వినిపించిన న్యాయవాదికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
న్యాయం జరిగిందని సంతోషిస్తున్నాం కానీ.. మా బాధను ఎవరు తీర్చలేరు. మా మనసులో ఎవరి మీద కూడా కోపం లేదని బాధిత కుటుంబం పేర్కొంది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు బ్రేక్ పడాలని, సమాజంలో కుల వివక్షలను తగ్గించడానికి ఇది ఒక గొప్ప సందేశం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.