Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి

  • ప్రాజెక్టుపై ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేసిన భట్టి
  • బీజేపీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్
  • కేంద్రం, మహారాష్ట్ర నుంచి అనుమతులు తేవాలని సూచన
  • భూమి ఆకాశాలు ఒకటైనా ప్రాజెక్టు కడతామన్న భట్టి
Bhatti

Bhatti

‎డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా? వద్దా? అనే దానిపై బీజేపీ సభ్యులు తమ స్పష్టమైన వైఖరిని చెప్పాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శాసనసభలో ఎల్లీ నో ప్రభావం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యల గురించి జరుగుతున్న చర్చలో భాగంగా ‎బీజేపీ సభ్యులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి అంశం లేవనెత్తడంతో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు.

‎గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లందించాలనే ఆలోచనతో తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని భట్టి గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టి, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. తెలంగాణకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్ట్ విషయంలో అటు బిఆర్ఎస్, ఇటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని మండిపడ్డారు.

‎అనుమతుల కోసం కేంద్రాన్ని, మహారాష్ట్రను ఒప్పించండి

బీజేపీ నాయకులు తమ ప్రాభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జలశక్తి శాఖను, పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు తీసకురావాలని కోరారు. సభ్యుడు హరీష్ రావు ఇచ్చిన సలహాను తాము సానుకూలంగా స్వీకరించి ప్రాజెక్ట్ కడతామని చెప్పామని, బీజేపీ సభ్యులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెస్తామని అంటారని ఆశించామని భట్టి చెప్పారు. అయితే మైక్ ఇవ్వగానే ప్రధాన విషయాన్ని వదిలేసి వేరే అంశాల్లోకి వెళ్లిపోయారని ఆక్షేపించారు. ‎”ఇప్పుడు మన ముందున్న ప్రధాన ప్రశ్న… తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడదామా? వద్దా? బీజేపీ సహకరిస్తుందా? లేదా? స్పష్టంగా చెప్పాలి. మీరు సహకరించినా, సహకరించకపోయినా మా ప్రభుత్వం మాత్రం భూమి ఆకాశాలు ఒకటైనా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించే తీరుతుంది” అని భట్టి విక్రమార్క సభలో స్పష్టం చేశారు.