Praja Galam Public Meeting LIVE Updates: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన సంయుక్తంగా ‘ప్రజాగళం’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే వేదిక మీద ప్రసంగించనున్న ఈ సభ నేపథ్యంలో మూడు పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చాయి. 2014 ఎన్నికల సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ నుండి టీడీపీ వైదొలిగింది. జనసేన కూడా టీడీపీతో తెగదెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సభలో ఈ మూడు పార్టీల నేతలు ఏం చెబుతారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధానంగా ప్రధాని మోడీ ఏపీకి ఏం హామీలు ఇవ్వబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
"ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోంది.. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించింది.. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించాం.. ఎన్డీయేలో మేము అందరినీ కలుపుకొని వెళ్తాం.. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట రోజున తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారు.. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారు.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు. . పీవీకి ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది, ఆయనను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసు." -ప్రధాని మోడీ
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు. రాష్ట్రాల ఆశలు నెరవెరుస్తూ.. దేశం కోసం ఎన్డీఏ పని చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ ఏపీ ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ ఎన్డీఏ లక్ష్యమన్నారు.ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటుందన్నారు. పేదలకు సేవ, పేదల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమని ప్రధాని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టామన్నారు. ఏపీలో జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా లబ్ది పొందారన్నారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు మేలు చేకూరుస్తున్నామన్నారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని మోడీ కోరారు. మేం పేదల అభ్యున్నతికి కృషి చేస్తాం.. ఇది మోడీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.
"చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడింది.. చంద్రబాబు, పవన్ ఏపీ కోసం కష్టపడుతున్నారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది.. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు." -ప్రధాని మోడీ
చిలకలూరిపేట: ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ ప్రసంగం.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. నాకు ఇక్కడ కోటప్పకొండ దగ్గర త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తోంది.. ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి, మాకు ఓటు వేయాలి అని తెలుగులో మాట్లాడిన ప్రధాని
వికసిత్ భారత్ మోడీ కల.. వికసిత్ ఏపీ మనందరి కల కావాలని చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోడీకి మేం అండగా ఉంటామన్నారు. దేశాన్ని జీరో పావర్టీ నేషన్‌గా చేయడం మోడీ వల్లే సాధ్యమన్నారు. 2014-19 మధ్య కాలంలో ఏపీలో 11 కేంద్ర సంస్థలను తెచ్చామన్నారు. మోడీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరిగిందన్నారు. ఐదేళ్లల్లో ప్రజల జీవితాల్లో ఆనందమే లేదన్నారు. గంజాయి సరఫరా, వినియోగం పెరిగిందని విమర్శించారు. విధ్వంసమే జగన్ విధానంగా ఉందని విమర్శించారు. ఏపీ పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. ఇద్దరు చెల్లెళ్లను కూడా జగన్ మోసం చేశారని ఆరోపణలు చేశారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని.. జగనుకు ఓటేయొద్దని జగన్ చెల్లెళ్లే చెప్పారన్నారు. బ్యాడ్ గవర్నెన్స్ వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారని, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారని.. ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీఏకు 400+ స్థానాలు రావడం ఖాయమన్నారు. ఏపీలో 25 ఎంపీ స్థానాలను గెలవాలని.. గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని వెల్లడించారు. మోడీ భారత దేశాన్ని విశ్వ గురుగా మారుస్తున్నారన్నారు. ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారని చంద్రబాబు తెలిపారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారన్నారు. ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారన్నారు.
నరేంద్ర మోడీ కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది.. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైంది. -పవన్ కల్యాణ్
ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని.. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్నారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందన్నారు. 2014లో వెంకన్న ఆశీస్సులతో ఎన్డీఏ విజయం సాధించిందన్నారు. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో అంతకు మించిన విజయం దక్కించుకుంటామన్నారు.
బొప్పూడిలో ప్రజాగళం సభా వేదిక మీదకు ప్రధాని మోడీ విచ్చేశారు. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్ కలుసుకున్నారు. 2014 ఎన్నికల సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.
ప్రజాగళం వేదిక నుంచి ఓ వ్యక్తికి గుణపాఠం నేర్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెల్లడించారు. మోడీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదిక మీదకు వచ్చారన్నారు. అభివృద్ది నిరోధకులను శంకరగిరి మాన్యాలు పట్టించాలన్నారు.
ప్రజాగళం సభ కోసం బొప్పూడి సభా ప్రాంగణానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా బొప్పూడికి మోడీ చేరకున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన 'ప్రజాగళం' సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు తర్వాత ఇదే తొలి సభ. ఈక్రమంలోనే ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సభ ద్వారా ప్రతి వర్గానికి ఓ సందేశం ఇవ్వబోతున్నామని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. గోదావరి పెన్నా అనుసంధానం చేయాలనే సంకల్పం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతోందన్నారు. ఏపీ యువత కలలకు రెక్కలు తొడుగుదాం.. ఉపాధి కల్పిద్దామన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణాంధ్ర ప్రదేశ్ గా చేయడానికి ఈ సభా వేదికే నాందీ అని పేర్కొన్నారు.
చిలకలూరి పేటలో జరుగుతోన్న ఈ సభ చరిత్రాత్మకమని బీజేపీ జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. జగన్ ప్రభుత్వం అవినీతితో పాటు అప్పులూ విపరీతంగా చేసిందన్న ఆయన.. ఉత్తరాది రాష్ట్రాలకంటే ఏపీ ఎంతో ముందుండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయిందన్నారు. యూపీని యోగి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మార్చారన్నారు. ఏపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నారు.