BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!

  • టీమిండియా పురుషుల సెలక్షన్ కమిటీకి కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా నియామకం..
  • అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు
  • పురుషుల సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుడిగా రమేష్ పవార్
  • ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు..
Pragyan Ojha Named Bcci Chief Selector

Pragyan Ojha Named Bcci Chief Selector

Pragyan Ojha Named BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha)ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. దీనితో ఇప్పుడు అక్టోబర్ 4న అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ రమేష్ పవార్ ను పురుషుల సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుడిగా బీసీసీఐ నియమించింది.

బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే దరఖాస్తుదారులను పరిశీలించి, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రమేష్ పవార్ నియామకాన్ని ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు. రమేష్ పవార్ భారత జట్టు తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్ రంగంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా, ముంబై, గుజరాత్ జట్ల కోచ్‌గా ఆయన పనిచేశారు. అంతేకాదు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు. భారత మహిళల జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో ఆసియా కప్ టైటిల్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇక మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సేవలను బీసీసీఐ ప్రశంసించింది. 2023 జూలైలో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కాలంలో భారత క్రికెట్ మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు, వరుసగా రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలు సాధించింది. సీనియారిటీ పరంగా అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. కొత్త పురుషుల సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓఝా (చైర్‌పర్సన్), శివ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేష్ పవార్ సభ్యులుగా కొనసాగనున్నారు.