Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..

Prabh Simran Singh

Prabh Simran Singh

పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ప్రభసిమ్రన్ సింగ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల ప్రకటించిన ఆప్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టులో ఇతనికి చోటు దక్కలేదు. ఆయన స్థానంలో సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. జూలై 2026లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో భాగమైనప్పటికీ, ఆ సమయంలో ప్రభసిమ్రన్‌కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఆప్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించిన కొద్ది గంటల్లోనే ఆయన తన బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండు వరుస శతకాలు బాది సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు.

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 13 వరకు జరుగుతున్న షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో ప్రభసిమ్రన్ సింగ్ జలంధర్ వారియర్స్ తరఫున ఆడుతున్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్‌పై కేవలం 47 బంతుల్లోనే 125 పరుగులు చేసి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత గురువారం బటిండా రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించి 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 110 పరుగుల విస్ఫోటక శతకాన్ని నమోదు చేశారు. ప్రభసిమ్రన్ మెరుపు శతకంతో జలంధర్ జట్టు 19.3 ఓవర్లలో 205 పరుగులు చేసి, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

లీగ్‌లో అంతకుముందు ఫాజిల్కా ఫాల్కన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఆయన 42 బంతుల్లో 76 పరుగులు చేశారు. ఈ విధంగా లీగ్‌లో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే మొత్తం 311 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అగ్రస్థానంలో నిలిచారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ప్రభసిమ్రన్, దేశవాళీ లీగ్‌లో కూడా తన స్థిరమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ ద్వారా తన సత్తాను చాటుతూ భారత జట్టులోకి పునరాగమనం చేయడానికి ఆయన బలంగా పోటీపడుతున్నారు.