Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పవర్ వివాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గంట సేపు కరెంటు కట్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో.. ఆ సమయంలో ఆలయ అధికారులు జనరేటర్ల ద్వారా దర్శనాలు కొనసాగించారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ విద్యుత్ అధికారులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం అమ్మవారి ఆలయానికి మళ్లీ కరెంటు సరఫరా ప్రారంభమైంది. అయితే, గత రెండేళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ వద్ద ఉన్న సోలార్ ప్లాంట్ ద్వారా ఇంద్రకీలాద్రి దేవస్థానం రోజుకు 24 మెగావాట్ల విద్యుత్‌ను ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. దానికి ప్రతిగా దేవస్థానానికి చెందిన 10 విద్యుత్ సర్వీసులకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ఒప్పందం ఉంది.
Read Also: Tragedy : ఆసుపత్రిలో మంచినీళ్లు అనుకొని కెమికల్ తాగి యువకుడు మృతి..
అయితే, ఇప్పుడు అదే 10 సర్వీసులకు బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరడం వివాదానికి కారణమైంది. ఒప్పందం ప్రకారమే రూ.2 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్ నిర్మించామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఒప్పందం రద్దు చేస్తే రూ.2 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని ఈవో శీనా నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఈవో కోరారు. మరి పవర్ వివాదం ఎటువైపు వెళ్తుందనేది వేచిచూడాలి..
