Site icon NTV Telugu

Posani Krishna Murali: ఏపీ వ్యాప్తంగా 17 కేసులు.. ముందు మాకే అప్పగించాలంటూ పీటీ వారెంట్‌లు!

Posani Krishna Murali

Posani Krishna Murali

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నరసరావుపేట తీసుకువచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

అంతకుముందు రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. గత నాలుగు రోజులుగా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు ఇచ్చారు. తాము కోర్టు అనుమతి తీసుకున్నాం అని, ముందుగా తమకే పోసానిని అప్పగించాలని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు కూడా పరిశీలించారు. ఉన్నతాధికారుల అనుమతితో నరసరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు.

తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని ఉదయం పోసాని కృష్ణమురళి జైలు అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి పోసానిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ సహా వారి కుటుంబాలపై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. 17 పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.

Exit mobile version