Minister Ponnam Prabhakar’s statement on TSRTC: గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేశారని, ఓ సమయంలో ఆర్టీసీ ఉంటుందా? అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి ఉండేదని, ఇప్పుడు వారికి డబ్బులు చెల్లిస్తున్నాం అని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసిందన్నారు. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఆర్టీసీ వేడుకలునిర్వహించింది. ఈ వేడుకలకు మంత్రి పొన్నం హాజరై మాట్లాడారు.
‘200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణం పూర్తయిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన 2023 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాసన సభ వేదిక మహాలక్ష్మి పథకం ప్రారంభించుకున్నాం. ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్నాం. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా వెళ్తున్నారు. ఉద్యోగాలు, షాపింగ్, దేవాలయాలు… ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. ఆర్టీసీ ఉంటుందా అని కూడా అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుంది. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం, నియామకాలు చేస్తున్నాం. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి, ఇప్పుడు వారి డబ్బులు చెల్లిస్తున్నాం’ అని మంత్రి పొన్నం తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: మహిళలు రూ.6680 కోట్లు ఆదా చేసుకున్నారు.. అందరికీ శుభాకాంక్షలు!
‘సంస్థ పరిరక్షణ ప్రయాణికుల సౌకర్యం ఉద్యోగుల సంక్షేమం నినాదంతో ఆర్టీసీ ముందుకు పోతుంది.ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు యజమానులకు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసింది. ఇటీవల 150 బస్సులకి కోటి రూపాయల చెక్కులు కూడా అందజేసాము. గతంలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 60 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు 97 శాతంకి పెరిగింది. ఆర్థిక విధ్వంసం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. ఈరోజు 97 బస్సు డిపోలు, 324 బస్ స్టేషన్లలో 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు 6680 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నాం’ అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
