Ponnam Prabhakar : హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి RTC బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్సు ప్రయాణం చేస్తూ, వారు ఇతర ప్రయాణికులతోపాటు మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలు, అవసరాల నిమిత్తం ప్రయాణించే వారు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడిన మంత్రి, వారి అభిప్రాయాలను స్వయంగా వినడంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
మహిళలు కూడా ఉచిత ప్రయాణం పథకం వల్ల నెలకు ఎంతో డబ్బు ఆదా అవుతోందని, అది తమ కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఎంతో తోడ్పడుతోందని తెలియజేశారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదని చెప్పారు. నగర రవాణా వ్యవస్థపై మాట్లాడిన మంత్రి, ఇటీవలే నగరంలో పెద్ద మొత్తంలో RTC బస్సులను ప్రవేశపెట్టామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతేగాక, ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేరువగా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో పాటు, మహిళా సంఘాలను ఆర్థికంగా చురుకుగా మార్చే లక్ష్యంతో అనేక ప్రత్యేక పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినదని మంత్రి వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా తెలిపారు.
RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. వారి సమస్యలను గౌరవప్రదంగా పరిష్కరిస్తూ, రవాణా సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రయాణం ద్వారా మంత్రి , ఇతర నాయకులు ప్రజల మద్యకు వెళ్లి వారి జీవితాల్లో మార్పు తెస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రత్యక్షంగా చూశారు. ప్రజల స్పందన విని, వారి అభిప్రాయాలను గ్రహించిన ఈ పరిణామం, పాలకులు ప్రజలతో నేరుగా మమేకమవుతూ పాలనను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసినట్టైంది.
