Site icon NTV Telugu

Ponguleti Sudharkar Reddy : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudharkar Reddy : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని, ఆయన నాయకత్వంపై ప్రజలు మరింత ఆకర్షితులవుతుండటంతో, కొన్ని పార్టీలు మోడీ పై తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నాయని ఆరోపించారు. ‘ఉత్తర–దక్షిణ’ అనే వాదనను ప్రొత్సహించి మోడీ గారిపై విమర్శలు చేస్తుండటం రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు.

కర్ణాటకలో ఎప్పుడెన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందని, తమిళనాడులోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయన్నారు సుధాకర్‌ రెడ్డి. డీఎంకే పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, తమ లక్ష్యం డీఎంకేను ఓడించడమే అని ఆయన వెల్లడించారు. ఆ దిశగా తమిళ ప్రజలు ఏకమవుతున్నారని ఆయన అన్నారు.

డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలసి బీజేపీపై కుట్రలు చేస్తున్నాయనీ, ఇటువంటి కుట్రలు వృథా ప్రయత్నంగానే మిగిలిపోతాయని తెలిపారు. మోడీ గారు రామేశ్వరంలో రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారని, ఆ కార్యక్రమానికి అనేక ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, నాయకులు హాజరుకావడానికి సిద్ధమయ్యారని తెలిపారు. దక్షిణ భారతదేశం – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మోడీ పాలనలో సమగ్ర అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. దేశం ‘ఆత్మనిర్భర్ భారత్’ మరియు ‘వికసిత్ భారత్’ లక్ష్యాలవైపు వేగంగా అడుగులు వేస్తోందన్నారు.

వక్ఫ్ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ, పేద ముస్లింల ప్రయోజనార్థమే ఈ చట్టం తీసుకొచ్చామని, కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డీఎంకే, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వక్ఫ్ చట్టం ద్వారా వేలాది ఎకరాల భూములు అక్రమార్కుల చేతిలోనుండి బయటపడతాయని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడడం ఖాయమని, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభ వెలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Muthayya: ఈటీవీ విన్ లో ‘ముత్తయ్య’

Exit mobile version