AP Polling Percentage: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదు అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పుకొచ్చారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరగడంతో పాటు ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అలాగే, ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంటుంది.. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ కొనసాగించాం.. కొన్ని చోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.. అక్కడ ఈవీఎం మిషన్లు మార్చి పోలింగ్ ను తిరిగి ప్రారంభించామన్నారు. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD: డబ్బింగ్ పూర్తి.. సినిమాలకు దీపికా పదుకొనే గ్యాప్!
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 11 చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా పేర్కొన్నారు. ఎక్కడా కూడా రీ పొలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని ఘర్షణలు జరిగినా వాటిని వెంటనే కట్టడి చేశాం.. ఇప్పటి వరకు 75.92 శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే, ఈవీఎంలను ఉంచి స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎంకే మీనా తెలిపారు. అయితే, ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది.. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత అన్న దానిపై పూర్తి క్లారిటీ వస్తుందన్నారు.