Site icon NTV Telugu

Yogandhra 2025: ‘పోలీసు యోగాంధ్ర’ కార్య‌క్ర‌మం.. పాల్గొన్న సీఎస్‌ విజయానంద్‌!

Yogandhra 2025

Yogandhra 2025

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్‌ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌, ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అంతేకాదు యువతీ యువకులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు.

తనువు, మ‌న‌సును ఏకం చేసి శ‌రీరం మొత్తాన్ని స్వ‌చ్ఛ‌త‌తో నింపే దివ్య ఔష‌ధం యోగా అని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతిఒక్క‌రూ త‌మ జీవ‌న మార్గంలో యోగా అభ్య‌స‌నాన్ని భాగం చేసుకోవాల‌న్న‌దే గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌కు అనుగుణంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల్లోనూ ప్ర‌తిరోజూ ఒక ఇతివృత్తంతో ఉత్సాహంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయి. రైతులు, విద్యార్థులు, కార్మికులు.. ఇలా ప్ర‌తి వ‌ర్గాన్ని యోగాంధ్ర‌లో భాగం చేసే ల‌క్ష్యంతోనే థీమ్ యోగా చేపట్టారు. రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మంది యోగాలో ప్ర‌వేశించేలా అవ‌గాహ‌న, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జరగనున్నాయి.

Also Read: Pawan Kalyan: చంద్రబాబు గారికి అభినందనలు.. విజయం కలగాలని కోరుకుంటున్నా!

నిపుణులు రూపొందించిన 45 నిమిషాల స‌ర‌ళ‌మైన యోగా కామ‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌తి గ్రామంలోనూ, ప్ర‌తి ప‌ట్ట‌ణంలోనూ యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాకు నాలుగు చొప్పున ప‌ర్యాట‌క ప్రాంతాల్లో యోగా ఔన్న‌త్యాన్ని చాటిచెప్పే కార్య‌క్ర‌మాలు ఉంటాయి. జూన్ 21న విశాఖలో ఘ‌నంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుక‌లు జరుగనున్నాయి.

Exit mobile version