Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందిని నేడు పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపారు. ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు. మే 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు వారందరినీ బెంగళూరు పోలీసులు విడివిడిగా విచారించనున్నారు.
‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో గత ఆదివారం (మే 19) రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇందులో 59 మంది పురుషుల, 27 మంది మహిళలు ఉన్నారు. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది.
Also Read: IPL 2024 Final: ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డ్!
నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చానీయంశంగా మారింది. పోలీసుల విచారణలో ఆమె ఎలాంటి విషయాలు బయటపెడుతుందనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నారు. హేమకు డ్రగ్స్ అలవాటు ఉందా?, ఎప్పటి నుండి డ్రగ్స్ తీసుకుంటుంది?, బెంగళూరు రేవ్‌పార్టీ వెళ్లింది? ఇలా అనేక విషయాలను బెంగుళూరు పోలీసులు కూపీ లాగనున్నట్లు తెలుస్తోంది.