Site icon NTV Telugu

Crime News: మైలపోలు తీస్తుండగా పెళ్లి ఆపిన పోలీసులు.. ఆఖరి నిముషంలో ఏం జరిగిందంటే?

Wedding

Wedding

Police Stop Wedding in Mahabubabad: ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి పెళ్లిని పోలీసులు అడ్డుకుని ఆపేశారు. మరో ఆరు గంటల్లో వివాహ ముహుర్తం ఉండగా.. వరుడికి ఇది వరకే పెళ్లైందని ఫిర్యాదు అందటంతో మైలపోలు తీస్తుండగా పెళ్లి క్రతువును పోలీసులు నిలిపేశారు. వరుడిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కి తరలించారు. మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి మోసం చేస్తావా అంటూ పెళ్లికూతురు, ఆమె తరఫు బంధువులు వరుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

డోర్నకల్‌ సీఐ రాజేష్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. డోర్నకల్ మండల కేంద్రంలోని యాదవ్‌నగర్‌కు చెందిన పచ్చిపాల మహేష్‌, అదే గ్రామంకు చెందిన ఓ యువతి ఒకే పాఠశాలలో చదివారు. స్కూల్ పరిచయం కాస్త క్రమేణా ప్రేమగా మారింది. మహేష్ చదువు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి బాగా చదువుకుని సెంట్రల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా బెంగుళూరులో విధులు నిర్వహిస్తోంది. నెల రోజుల క్రితం ఇద్దరు హైదరాబాద్‌లో సంప్రదాయ బద్దంగా ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. విషయం ఇంట్లో చెప్పి తీసుకెళ్తానని యువతితో మహేష్ చెప్పాడు.

Also Read: Virat Kohli: రిటైర్మెంట్‌ న్యూస్ మధ్య.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్!

పెళ్లి విషయం మహేష్ కుటుంబసభ్యులకు చెప్పలేదు. అంతేకాకుండా పెద్దలు మరో అమ్మాయితో (నేలకొండపల్లి మండలం రాజేశ్వరరావుపురం గ్రామం) కుదిర్చిన వివాహానికి సిద్దమయ్యాడు. మహేష్ మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని తెలుసకున్న యువతి.. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఫోటోలను, వీడియోలను వాట్సప్ ద్వారా పంపి.. మహేష్ పెళ్లిని ఆపాలని కోరింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున మహేష్ ఇంటికి వెళ్లి ప్రెళ్లి కార్యక్రమాన్ని నిలిపేసి విచారించగా విషయం వాస్తవమేనని ఒప్పుకున్నాడు. వరుడిని పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చారు. ఇలా మోసం చేస్తారా అంటూ పెళ్లికూతురు బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు, పెద్ద మనుషులు నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

 

Exit mobile version