కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆరు నెలల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అమ్మ శైలజ, అమ్మమ్మ అన్నవరం కలిసి చిన్నారిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనుమాం వచ్చి శైలజ, అన్నవరంను పోలీసులు విచారించగా.. అసలు విషయం బయట పడింది. తల్లి, కూతుళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో అన్నవరం నివాసం ఉంటోంది. అన్నవరం కూతురు శైలజ కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని నెలలుగా అల్లుడు, కూతురు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కూతురికి వేరొకరితో పెళ్లి చేయాలని తల్లి అన్నవరం నిర్ణయించుకుంది. పథకం ప్రకారం అడ్డుగా ఉన్న ఆరు నెలల బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నారు. పథకంలో భాగంగా చిన్నారిని తల్లి, అమ్మమ్మ కలిసి అర్ధరాత్రి బావిలో పడేశారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు గుమ్మం ముందువేసి.. క్షుద్రపూజలు, చేతబడి చేశారంటూ కట్టు కథలు అల్లారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్‌ఫుల్’ కెప్టెన్!
క్షుద్రపూజల కోసమే ఈ హత్య జరిగినట్లు అందరూ అనుమానించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శైలజ, అన్నవరంతో పాటు చిన్నారి తండ్రి, తాయయ్యలను పోలీసులు విచారించారు. శైలజ, అన్నవరం సమాధానాల్లో పొంతన లేకపోవడం.. వారి ప్రవర్తన తీరుతో పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇద్దరిని గట్టిగా విచారించగా అసలు విషయం చెప్పారు. తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
