NTV Telugu Site icon

Kadambari Jethwani: ముంబయి నటి జేత్వాని ఫిర్యాదు.. కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు

Kadambari Jethwani

Kadambari Jethwani

Kadambari Jethwani: ముంబయి నటి కాదంబరి జేత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జేత్వాని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తనను తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఫిర్యాదుపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొనగా.. ప్రస్తుతానికి విద్యాసాగర్ పై మాత్రమే కేసు నమోదైనట్లు తెలిసింది. కుక్కల విద్యాసాగర్‌, మరికొందరిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్‌ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల పాత్ర పై విచారణ చేసి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గతంలో కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇదే స్టేషన్‌లో జేత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Crime: వేధింపుల కేసు పెట్టేందుకు వెళ్లిన మహిళపై వ్యభిచారం కేసు!

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కాదంబరి జేత్వాని నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడిపోయారు. మరోవైపు.. కేసు విచారణను వేగవంతం చేశారు.. గతంలో విజయవాడ వెస్ట్ ఏసీపీగా ఉన్న హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణలను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అక్కడి ఆగకుండా మరి కొంత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడం కలకలం రేపుతోంది.. మరోవైపు.. కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ను నియమించిన విషయం విదితమే.. ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడిన నేపథ్యంలో.. తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటారో అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.. మరోవైపు.. కొందరు అధికారుల్లో టెన్షన్‌ కూడా మొదలైంది.

 

Show comments