మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన 5 సంవత్సరాల బాలుడు మనీష్ కుమార్ హత్య కేసును పోలీసులు చేధించారు. కొడుకును హత్య చేసింది తల్లే అని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కన్న కొడుకులను తల్లే చంపడంతో కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపేందర్ – శిరీష దంపతులు ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు.. మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. భర్త ఉపేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే కొంత కాలం నుంచి తన భర్త అక్రమ సంబంధాలు అంటగడుతూ వేధిస్తున్నాడని భార్య శిరీష పోలీసు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
పిల్లలను కూడా దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాడని మానసికంగా కుమిలిపోయినట్లు వెల్లడించారు. భర్త తాగుడుకు బానిసై భార్యను పిల్లలను పట్టించుకోకపోవడంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తాను చనిపోతే పిల్లలను పట్టించుకునే వారు లేరని భావించి వారిని చంపి తాను చనిపోవాలని అనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 24 వ తేదీ న మనీష్ కుమార్ ను నైలాన్ తాడు తో మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి తల్లి శిరీష చింపేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం ఈ బాలుడి పై హత్యాయత్నం చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read:Farmer Suicide: “నా పిల్లల చదువు బాధ్యత సీఎం తీసుకోవాలి..” లేఖ రాసి రైతు ఆత్మహత్య..
అంతకు ముందు 15 జనవరి 2025 న చిన్న కుమారుడు నిహాల్ (2 ) నీటి సంపు లో పడేసి చంపినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండవ కుమారుడు ప్రాణాలతో ఉన్నట్లు తెలిపారు. కసాయి తల్లి శిరీష ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా పిల్లలు వరుసగా చనిపోతుండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల పనేనని కుటుంబసభ్యులు భావించారు. చివరకు కన్న తల్లే పిల్లలను చంపిందన్న నిజం తెలిసి షాక్ కు గురయ్యారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల వరుస మరణాలతో కుటుంభికులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శిరీషను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
