Police Commemoration Day 2024: ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఒక పవిత్రమైన కార్యక్రమం అని, ప్రజా సేవ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఏపీలో జీరో క్రైమ్ ఉండాలని, నేరాలు చేయాలంటే ఎవరైనా బయపడేవిధంగా పోలీసులు ఉండాలని సీఎం పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు కూడా పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రజాసేవ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలి. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన అధికారుల స్ఫూర్తి ఇప్పటికీ అందరిలో ఉంది. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసు సేవలు అవసరం. రాత్రి-పగలు పనిచేసేది పోలీసులు. అన్ని శాఖల్లో కీలకమైంది పోలీస్ శాఖ. 24 గంటలు పనిచేసే శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఏపీలో జీరో క్రైమ్ ఉండాలి. రాష్ట్రంలో నేరాలు చేయాలంటే భయపడే విధంగా వ్యవహరించాలి. లా అండ్ ఆర్డర్ మొదటి ప్రాధాన్యత’ అని అన్నారు.
‘పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాం. పోలీస్ సంక్షేమం కోసం ప్రతి ఏడాది నిధులు ఇస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం కేంద్రం కూడా ముందుకు వస్తోంది. పోలీసులపై పెట్టుబడి అంటే రాష్ట్ర అభివృద్ధికి కోసం పెట్టిన పెట్టుబడి. నేరస్తులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నపుడు.. పోలీసులు పాత తరం వాడితే పోరాటం చేయటం కష్టం. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన చాలా బిల్లులు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వం కక్ష సాధింపు, రాజకీయ వేధింపుల కోసం పోలీసులను వాడారు. ఐపీఎస్ వ్యవస్థను కూడా ఇందు కోసం వాడారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
‘మాజీ సీఎం జగన్ రక్షణ కోసం 12 కోట్లతో కంచే ఏర్పాటు చేసుకుని.. ఫింగర్ ప్రింట్ కోసం 10 కోట్లు ఇవ్వలేదు. సర్వే రాళ్లపై బొమ్మ కోసం కోట్లాది రూపాయలు తగలేసిన మాజీ సీఎం.. సీసీ కెమెరాల కోసం 700 కోట్లు మంజూరు చేయలేదు. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పోలీసులకు సరెండర్ లీవ్ ఇవ్వలేదు. పోలీస్ వ్యవస్థపై ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఆధునిక పరికరాలు తెప్పిస్తాం. నేరాల తీరు మారుతోంది.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.