Site icon NTV Telugu

Call Money Case: నూటికి పది రూపాయల వడ్డీ.. కాల్ మనీ కేటుగాడు రాజా అరెస్ట్

Call Money Case

Call Money Case

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ డాడికి పాల్పడింది. తాజాగా ప్రధాన నిందితుడు రాజాను అరెస్ట్ చేసి.. అతని వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్లు గుర్తించారు.

Also Read:Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్

నూటికి పది రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. అది కూడా కొందరు వారం వడ్డీ, రోజు వడ్డీల ప్రకారం ఇస్తున్నారంటే ఆ దోపిడీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా జనాల రక్తాన్ని జలగలా పీలుస్తున్న కాల్ మనీ కేటుగాడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో అక్రమ వడ్డీ వ్యాపారం, హింసాత్మక వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాడు సాకే రాజశేఖర్ అలియాస్ ఎరికల రాజా అలియాస్ యర్రగుంట్ల రాజా. ఇతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ, వడ్డీ చెల్లించని వారిని తన గుంపుతో కలిసి బెదిరించడం. దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై దాడి చేసిన కేసులో రాజాతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:Venky Comedian Ramachandra : మంచాన పడ్డ ‘వెంకీ’ సినిమా కమెడియన్ రామచంద్ర

జులై 23న ఎర్రగుంటకు చెందిన రాజాతోపాటు అతని అనుచరులు మొత్తం ఏడుగురు.. బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు. రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. ‘కొట్టొద్దండి… చచ్చిపోతాం’ అంటూ ఎంతబతిమిలాడినా దయచూపలేదు. అమానుషంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే యత్నం చేయలేదు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వెంటనే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే కేసులో రాజాను అరెస్ట్ చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం, దాడులు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకి పాల్పడే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

Exit mobile version