శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తుంటే మూఢనమ్మకాలు మాత్రం ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్ పేరుతో అమాయక ప్రజలను వంచిస్తున్నారు కేటుగాళ్లు. మరికొందరు క్షుద్ర పూజల పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజల పేరుతో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
Also Read:Hyderabad: కూకట్ పల్లి అంకుర ఆసుపత్రిలో మరో దారుణం.. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్‌కి..
అనారోగ్య కారణాల వల్ల క్షుద్ర పూజలతో సమస్య తీరుతుందని బాధితులకు నమ్మబలికాడు నిందితుడు అభినయ్ కుమార్. నిందితుడు మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లాకు చెందిన సక్రాని గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితులకు క్షుద్ర పూజల వల్ల అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మబలికి గదిలో మహిళను ఒంటరిగా ఉంచి, కుటుంబ సభ్యులను బయటకు పంపించాడు. గది లో ఒంటరిగా ఉన్న మహిళకు క్షుద్ర పూజలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిపోయిన మహిళ కేకలు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లారు. జరిగిన విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read:Bandi Sanjay: కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది..
నిందితుడు అభినయ్ కుమార్ పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి వివరించారు. ప్రజలు ఆధునిక సమాజంలో మంత్ర తంత్రాలను నమ్మవద్దని ఎలాంటి సమస్యలు ఉన్న వైద్య సదుపాయాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో మంత్రాలను బాబాలను నమ్మవద్దని తెలిపారు. వైద్యం అభివృద్ధి చెందిన భారతదేశంలో అన్ని సమస్యలకు సరైన మార్గం లభిస్తుందని వైద్యం ద్వారా వీలైనంతవరకు సమస్యల పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బాబాల మంత్ర తంత్రాల ద్వారా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. ప్రజలందరూ వాటిని నమ్మవద్దని సూచించారు.
