NTV Telugu Site icon

Chittoor Crime News: చిత్తూరు కాల్పుల ఘటన.. దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి!

Chittoor Robbery

Chittoor Robbery

చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి పన్నాగం పన్నాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న ఏడుగురుతో ఒప్పందం కుదుర్చుకుని.. ప్లాన్ అమలు చేశాడు. డమ్మీ గన్నుతో బెదిరించి.. డబ్బు దోచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ప్లాన్ బెడసికొట్టి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

చిత్తూరులో ఎస్‌ఎల్‌వీ ఫర్నిచర్ షోరూం యజమాని సుబ్రహ్మణ్యం అప్పుల పాలయ్యాడు. తనకు తెలిసిన వ్యక్తి, పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంటిలో దొంగతనానికి ప్లాన్ వేశాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న ఏడుగురుతో సుబ్రహ్మణ్యం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈరోజు ఉదయం చంద్రశేఖర్ ఇంటికి వెళ్లిన సుబ్రహ్మణ్యం.. డమ్మీ గన్నుతో బెదిరించాడు. తెలిసిన వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ వారిని నెట్టివేసి ఇంటిలో నుంచి బయటకు వచ్చి తాళం వేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అప్రమత్తమైన పోలీసులు చంద్రశేఖర్‌ ఇంటిని చుట్టుముట్టారు. రెండున్నర గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించారు. ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పరారయ్యారు. దొంగల ముఠాలో ముగ్గురు అనంతపురం, ఇద్దరు నంద్యాల, ఒకరి చిత్తూరు చెందిన వారుగా గుర్తించారు. పరారీలోని ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.