NTV Telugu Site icon

Puttaparthi police action: పుట్టపర్తి అల్లర్లు… చర్యలకు రెడీ అయిన పోలీసులు

Pparthi

Pparthi

ప్రశాంతంగా ఉన్న ప్రశాంతి నిలయంలో.. రాజకీయ అలజడులు అలర్లు సృష్టించిన వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఘటనలో కేసుల నమోదులో కూడా రాజకీయాలు ఉన్నాయన్న ఆరోపణలు ప్రారంభమయ్యాయి. అసలు గొడవకు కారణం ఎవరు.. గొడవలు చేసింది ఎవరు.. విధ్వంసం సృష్టించింది ఎవరు.. ఎవరిపై కేసులు నమోదు చేశారు.. ఆ ఘటన వెనుక ఏం జరిగింది…

నియోజకవర్గ అభివృద్ధికి ఎవరేంచేశారో చర్చకు రావాలంటూ ఈనెల 1తేదిన ఇటు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అటు పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. చెప్పులు విసిరారు. కర్రలతో విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. ఆయనకు రక్షణగా నిలబడిన అనుచరులు, టీడీపీ కార్యకర్తలపైనా విరుచుకుపడ్డారు. ఈ దాడి జరుగుతుండగానే పల్లె రఘునాథరెడ్డి తన వాహనం పైకి ఎక్కి మీసం మెలేసి..తొడకొట్టారు. వైసీపీ దాడులను ప్రతిఘటిస్తూ టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతి దాడి చేశారు. ఈక్రమంలో రెండుకార్లు, పోలీసు వాహనం ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. చర్యలకు సిద్ధమయ్యారు. పుట్టపర్తిలో 30పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా.. రాజకీయ సమావేశాలకు అనుమతులు లేవన్నా.. ఇరు వర్గాల వారు వాటిని లెక్క చేయకుండా దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి ఇరు వర్గాల వారిపై కేసులు నమోదుచేశారు. కానీ ఇక్కడ కూడా రాజకీయాలు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులపైనా, దాడికి గురై గాయాలపాలైన టీడీపీ నాయకులపైనా ఒకే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని అంటున్నారు.

Read Also: Mohanlal: మోహన్‌లాల్ పచ్చి మోసగాడు.. చనిపోయేలోపే అతని బండారం బయటపెడతా

టీడీపీ శ్రేణులే పోలీసు వాహనంపై దాడికి పాల్పడ్డారంటూ వారిపై మరో కేసు పెట్టారని అంటున్నారు. టీడీపీ నాయకుడు ఎస్.రామాంజనేయులు ఫిర్యాదు ఇవ్వగా.. దాని ఆధారంగా వైకాపా నాయకులపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు వారితో పాటు బాధితుడైన ఫిర్యాదుదారు, దాడికి గురైన ఇతర టీడీపీ నాయకుల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారని ఆరోపిస్తున్నారు. అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలతో ప్రదర్శన చేశారని, చట్టవిరుద్ధంగా గుమికూడారని, ప్రభుత్వోద్యోగి ఆదేశాలు ఉల్లంఘించారని, బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 149, 188, 506 తదితర సెక్షన్ల కింద ఇరువర్గాలపైన ఒకే కేసు కట్టారు. మాజీమంత్రి పల్లె సహా 9మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సహా 9మంది నాయకుల్ని నిందితులుగా చూపారు. ఈ గొడవల్లో పాల్గొన్న ఏ ఒక్కర్నీ వదిలి పెట్టలేదని పోలీసులు చెబుతున్నారు.