Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!

Maredumilli Tourism

Maredumilli Tourism

Polavaram Weather Attracts Tourists: పోలవరం ఏజెన్సీ ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా తెల్లటి పొగమంచు పరుచుకుని ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండలు, గుట్టలు, పచ్చని అడవుల మధ్య మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి. చల్లని గాలులు.. మబ్బులతో నిండిన కొండలు.. మంచు తెరల మధ్య నుంచి తొంగిచూస్తున్న సూర్యకిరణాలు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. దీంతో మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లకు విహారయాత్రికుల తాకిడి పెరుగుతోంది.

పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున నుంచి ఉదయం 9 గంటల వరకు అనేక గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. కొండలు, గుట్టలు, లోయలు, పచ్చని అటవీ ప్రాంతాలు మంచు తెరల మధ్య కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ఒడిలోని గిరిజన గ్రామాలు మంచు అందాలతో కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. మరోవైపు మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ల నుంచి మంచు తెరల మధ్య కనిపించే కొండలు, లోయల అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మైమరచిపోతున్నారు. చల్లని గాలులు, పొగమంచు మధ్య ప్రకృతి అందాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున మంచు తెరల మధ్య నుంచి సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా శీతాకాలం ఆరంభంలోనే పోలవరం ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా మారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.