PNB Fraud: పీఎన్‌బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!

  • గ్రేటర్ నోయిడాలోని పీఎన్‌బీ శాఖలో భారీ మోసం
  • ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైన సుమారు రూ.35 కోట్లు..
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాల నుంచి నగదు బదిలీ..
Pnb Scam

Pnb Scam

PNB Fraud: బ్యాంకుకు వెళ్లలేదు.. విత్‌డ్రాయల్ ఫారాలు నింపలేదు.. ఎలాంటి పేపర్లపై సంతకాలు చేయలేదు. కనీసం లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు కూడా రాలేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు సహా అకౌంట్లలో దాచుకున్న కోట్లాది రూపాయలు రాత్రికి రాత్రే గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శాఖలో వెలుగుచూసిన ఈ భారీ మోసం సంచలనం సృష్టిస్తోంది. ఈ శాఖలో దాదాపు రూ. 35 కోట్ల మేర నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం.

బాధితులు బ్యాంకుకు వెళ్లి ఖాతాల వివరాలు తనిఖీ చేసుకున్న తర్వాతే తాము మోసపోయామని గ్రహించారు. విజేంద్ర సింగ్ అనే ఖాతాదారుడి ఖాతాలో గతంలో సుమారు రూ. 87 లక్షలకు పైగా ఉండగా.. ప్రస్తుతం అందులో కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే మిగిలాయి. మరో ఖాతాదారుడి ఖాతా నుంచి రూ. 39 లక్షలు, మరొకరి అకౌంట్ నుంచి రూ. 9.5 లక్షలు మాయమయ్యాయి. ఇలా పలువురి డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు తేలింది. ఈ అక్రమ లావాదేవీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసనకు దిగారు. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు యాజమాన్యం కూడా అంతర్గత విచారణ జరిపి.. బ్రాంచ్ మేనేజర్‌తో సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.

ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు సుమారు 18 మంది బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బ్యాంకు అంతర్గత విచారణతో పాటు అవినీతి నిరోధక విభాగానికి (ACB) కూడా ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖాతాదారుల నగదును తిరిగి రాబట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బ్యాంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే జరిగిన మోసం రూ. 35 కోట్ల వరకే పరిమితమా లేక ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయా అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే స్పష్టత రానుంది.