PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఈ యుద్ధం వల్ల ఇరువైపు సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేయడంతో 1400 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై జరిపిన వైమానికదాడుల్లో 3000 మంది మరణించారు. మంగళవారం గాజాలోని అల్ అహ్లీ హస్పిటర్ పై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. అయితే ఈ దాడికి ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ‘‘గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్‌లో జరిగిన విషాదకరమైన ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ పౌర ప్రాణనష్టం తీవ్రమైన, నిరంతర ఆందోళనకర విషయం, ఇందులో పాల్గొన్న వారు బాధ్యత వహించాలి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
Read Also: Israel Hamas War: గాజా అల్ అహ్లీ ఆస్పత్రి దాడి ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
గాజా నగరంలో అల్-అహ్లీ ఆస్పత్రిలో జరిగిన పేలుడులో 500 మంది మరణించారు. ఇజ్రాయిల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల ఫలితంగానే పేలుడు సంభవించిందని హమాస్ పేర్కొంది. అయితే ఈ పేలుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పేర్కొంది. పాలస్తీనా సాయుధ గ్రూరు ఇస్లామిక్ జిహాద్ సంస్థ జరిపిన క్షిపణి మిస్ ఫైర్ కారణంగానే పేలుడు జరిగిందని పేర్కొంది.
ఈ ఘటన పట్ల పలు దేశాధినేతలు, ఐక్యరాజ్యసమితి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ.. వందలాది మంది ప్రజలను చంపడం భయపెట్టిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.