NTV Telugu Site icon

Rozgar Mela: రానున్నది జాబుల జాతర.. మోదీ చేతుల మీదుగా ముహూర్తం

Pm Narendra Modi

Pm Narendra Modi

Rozgar Mela: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని నిరూపించుకోబోతోంది. దేశ వ్యాప్తంగా పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అక్టోబర్ 22న ముహూర్తం నిర్ణయించింది. ఆ రోజు ప్రధాని మోడీ కొత్త పథకాన్ని లాంచ్ చేయనున్నారు. రోజ్ గార్ మేళాను ప్రారంభించనున్నారు. తొలివిడుత ఏకంగా 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగంలో చేరనున్న సిబ్బందిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని పీఎంఓ ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా చేరేవారు కూడా దేశవ్యాప్తంగా మొత్తం 38 భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్స్‌లో చేరనున్నారని పీఎంఓ తెలిపింది. ఇందులో గ్రూప్- ఏ, గ్రూప్- బి (గెజిటెడ్), గ్రూప్- బి (నాన్- గెజిటెడ్), గ్రూప్- సి కేటగిరీలు ఉన్నాయని వెల్లడించింది. వీటిల్లోనే కేంద్ర రక్షణ బలగాల సిబ్బంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎల్ డీసీ, స్టెనో, పీఏ, ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్స్, ఎంటీఎస్ ఇతరులు కూడా ఉండనున్నట్లు వెల్లడించింది. కొత్త ఉద్యోగులను నేరుగా నియమించుకోవడం లేదా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏజెన్సీల ద్వారా నియమించడం జరుగుతుందని పీఎంఓ వివరించింది.

Read Also: Rishi Sunak: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. అందరి చూపు రిషి సునాక్‌ వైపే?

అంతకుముందు జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖతో సమావేశమయ్యారు. అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రానున్న ఏడాదిన్నరలోగా.. అంటే 2023 పూర్తయ్యేలోగా ఏకంగా 10 లక్షల మంది ఉద్యోగులను.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియమించుకోనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్-ఏలో (గెజిటెడ్) 23,584 పోస్టులు, గ్రూప్- బిలో (గెజిటెడ్) 26,282, గ్రూప్-బిలో (నాన్- గెజిటెడ్) 92 వేల525, గ్రూప్- సి (నాన్- గెజిటెడ్) లో 8.36 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం రక్షణ శాఖ పరిధిలోనే గ్రూప్- బి నాన్ గెజిటెడ్ కింద 39 వేలకుపైగా, గ్రూప్- సి కింద 2.14 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉంది. రైల్వేలో 2.91 లక్షల గ్రూప్- సి పోస్టులు, ఎంహెచ్ఏలో 1.21 లక్షల గ్రూప్- సి (నాన్- గెజిటెడ్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.