ఢిల్లీ – సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఎన్డీయే తమ బల ప్రదర్శనకు సిద్ధం అవుతుంది. దేశానికి రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు దాదాపు ఖాయమని అనిపిస్తున్నా, కూటమి మాత్రం ఓటు శాతం, క్రమశిక్షణ, హాజరు వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.
Also Read:AR Murugadoss : మురుగదాస్ డౌన్ ఫాల్ కు ‘మదరాసి’ బ్రేకులేస్తుందా?
100 శాతం హాజరు – ఎందుకు అంత ప్రాధాన్యం?
ఎన్డీయేకు పార్లమెంట్ ఉభయసభల్లో 400కి పైగా ఓట్ల బలం ఉంది. ప్రస్తుత ఎన్డీయే బలం రాధాకృష్ణన్ విజయానికి సరిపోతుంది. అయితే ఎన్డీయే లోని ఏ ఒక్క ఎంపీ కూడా గైర్హాజరు కాకుండా చూసుకోవడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఎన్నికలోని ప్రతి ఓటు ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా విపక్షం ఏకం అనే సంకేతాలు ఇస్తున్న క్రమంలో తామూ ఒక్కటిగానే ఉన్నాం అనే బలమయిన సంకేతాలు ఇవ్వాలని ఆలోచిస్తోంది ఎన్డీయే.
ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం వ్యూహాత్మక కసరత్తు
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేవు. దాంతో ఎంపీలు పెద్దగా ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపరు. పైగా ఇతర కార్యక్రమాలు తమ రాష్ట్రాల్లో, లేదంటే విదేశాల్లోనూ ప్లాన్ చేసుకుంటారు. అయితే పోలింగ్ జరిగే తేదీ కంటే ముందే ఎన్డీయే ఎంపీలను డిల్లీకి పిలుస్తున్నారు. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు ఎంపీలకు వర్క్‌షాపులను నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతి ఓటింగ్‌లో చిన్న తప్పిదం కూడా ఓటు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎంపీలకు ఉపరాష్ట్రపతి పోలింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read:Mitchell Starc: మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం!
ప్రధాని విందు ఎన్డీయే ఐక్యతకు సంకేతం
సెప్టెంబర్ 8న ప్రధాని మోడి ఎన్డీయే ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఆతిథ్యమే కాదు ఎన్డీయేలోని అన్ని పార్టీలకు ఐక్యత సంకేతం ప్రధాని ఇచ్చే విందు ద్వారా ఇవ్వనున్నారు. విందు సమయంలో రాజకీయ చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు రాబోయే రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తారు.
