Site icon NTV Telugu

PM Modi: ఇరు దేశాలకు మంచి న్యూస్.. ట్రంప్‌నకు మోడీ కృతజ్ఞతలు

Modi5

Modi5

భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా విడుదలైంది. ఒప్పందంపై ఫ్రేమ్‌వర్క్‌కు రెండు దేశాలు అంగీకారం తెల్పాయి. ఇక రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం సుంకాన్ని ట్రంప్ ఎత్తేశారు. సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు.. ట్రంప్ వ్యక్తిగత నిబద్ధతకు మోడీ ధన్యవాదాలు చెప్పారు. రెండు దేశాలకు ఇది మంచి శుభవార్త అన్నారు. ఈ ఒప్పందం నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. దేశంలో కష్టపడి పని చేసే రైతులు, వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులు, మరికొందరికి కొత్త అవకాశాలు దొరకడం ద్వారా ‘‘మేక్ ఇన్ ఇండియా’’ను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు.

పీయూష్ గోయల్ ఎక్స్ పోస్ట్..
భారత్-అమెరికా ఒప్పందంతో భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలు, రైతులు, మత్స్యకారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల భారీ మార్కెట్‌కు దారి తీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్‌లో చెప్పారు. మహిళలు, యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడం వల్ల వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విభాగాలు వంటి అనేక వస్తువులపై సుంకాలు సున్నాకి తగ్గించబడతాయని.. దీని ద్వారా ‘‘మేక్ ఇన్ ఇండియా’’ను మరింత బలపరుస్తుందని కేంద్రమంత్రి అన్నారు. తాజా ఒప్పందంతో రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని చెప్పారు. గ్రామీణ జీవనోపాధిని నిలబెడుతుందన్నారు. మొక్క జొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాలు, పొగాకు, కొన్ని కూరగాయాలు, మాంసం మొదలైన సున్నితమైన వ్యవసాయ, పాల ఉత్పత్తులను పూర్తి రక్షణ కలిగిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా ఆర్థిక సహాకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని పీయూష్ గోయల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

Exit mobile version