PM Modi Adilabad Schedule Today: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువగా విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సభలు ఆ పార్టీ అభ్యర్థులకు ఉపయోగపడనుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారు. రోడ్డు మార్గంలో ప్రధాని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి చేరుకుంటారు. అక్కడ మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. ఇందులో రామగుండం నేషల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకూ రూ.2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.
Also Read: Road Accident: కొత్తకోటలో చెట్టును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి!
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని రెండో వేదికపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభలో కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో నాందేడ్‌కు వెళుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని సోమవారం రాత్రికి రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేయనున్నారు.