NTV Telugu Site icon

Mann Ki Baat – PM Modi: ‘డిజిటల్ అరెస్ట్’లపై మోడీ ఆందోళన.. ప్రజలకు కీలక సూచనలు..

Pm Modi

Pm Modi

పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి.. ‘ ఆలోచించండి, చర్య తీసుకోండి’ అనే మంత్రాన్ని దేశప్రజలతో పంచుకున్నారు. దీని గురించి గరిష్ట అవగాహన కల్పించాలని కోరారు. ఆల్ ఇండియా రేడియో నెలవారీ రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ 150వ ఎపిసోడ్‌లో.. ‘డిజిటల్ అరెస్ట్’కి సంబంధించి ఓ మోసగాడు, బాధితుడి మధ్య జరిగిన సంభాషణ యొక్క వీడియోను కూడా ప్రధాని పంచుకున్నారు. ఏ ఏజెన్సీ బెదిరించదు లేదా వీడియో కాల్స్ చేయదు అని ప్రధాని తెలిపారు. ఆన్‌లైన్‌లో విచారించదు.. డబ్బు డిమాండ్ చేయదని స్పష్టం చేశారు.

పెరుగుతున్న మోసాలు..
వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం మధ్య.. ‘డిజిటల్ అరెస్ట్’ మోసానికి ప్రధాన మాధ్యమంగా మారుతోంది. ఇందులో ఓ వ్యక్తిని ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం అరెస్టు చేసిందని చెప్పి.. జరిమానా కట్టాల్సి ఉంటుందని బెదిరిస్తాడు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది భయపడి బాధితులవుతున్నారు. ఇలాంటి మోసాల ముఠాలు ఎలా పని చేస్తాయి. ‘ప్రమాదకరమైన గేమ్’ ఎలా ఆడుతాయో ‘మన్ కీ బాత్’ వీక్షకులకు ప్రధాని సవివరంగా వివరించారు.

‘ ఆపండి.. ఆలోచించండి, చర్య తీసుకోండి’ మంత్రం

‘డిజిటల్ అరెస్టు’ బాధితుల్లో అన్ని రంగాలు, వయసుల వ్యక్తులు ఉన్నారని ప్రధాని తెలిపారు. మోసగాళ్లు భయ పెట్టి తాము కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను దోచుకుంటున్నారన్నారు. అలాంటి కాల్‌ వస్తే భయపడవద్ద తెలిపారు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా ప్రశ్నించదని స్పష్టం చేశారు. ఈ మోసానికి బలి కాకుండా ఉండేందుకు “ఆపండి.. ఆలోచించండి.. చర్య తీసుకోండి” అనే మంత్రాన్ని ఉపయోగించాలని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో భయపడవద్దని చెప్పారు. ప్రశాంతంగా ఉండాలని.. తొందరపడి ఏ అడుగు వేయవద్దని.. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారు. వీలైతే, స్క్రీన్‌షాట్ తీసుకొని రికార్డింగ్ చేయాలని తెలిపారు.

నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ 1930…
మీకు భయం అనిపిస్తే ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకోండి అని మోడీ అన్నారు. అటువంటి సందర్భాలలో నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేసి, కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు వాటిని cybercrime.gov.inలో నివేదించాలని ప్రధాన మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. సాక్ష్యాలను భద్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఈ మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయని.. డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని పునరుద్ఘాటించారు. ఇది కేవలం మోసమని గుర్తుంచుకోవాలని సూచించారు.

డిజిటల్ అరెస్ట్‌పై చర్యలు తీసుకుంటున్నాం – ప్రధాని
‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కోవడానికి అన్ని దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పరస్పర సమన్వయం, నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ కోసం పనిచేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇలా మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను బ్లాక్ చేశామన్నారు. లక్షల సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయని.. ఇలాంటి సందర్భాల్లో ఏజెన్సీలు తమ పని తాము చేసుకుపోతున్నాయని, అయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించేందుకు అవగాహన చాలా అవసరమని మోడీ అన్నారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రతిచోటా దీనిపై అవగాహన కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.