NTV Telugu Site icon

Vandebharat Express: మరో 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

Vandebharat Express

Vandebharat Express

Vandebharat Express: దేశవ్యాప్తంగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా వందేభారత్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను ఈ రైళ్లు కలుపుతాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు కొత్తగా ప్రారంభించే వందేభారత్ రైళ్లు సహాయపడనున్నాయి.

కొత్త వందేభారత్ రైళ్ల రూట్లు ఇవే:
ఉదయపూర్ – జైపూర్
తిరునెల్వేలి-మధురై – చెన్నై
హైదరాబాద్ – బెంగళూరు
విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా)
పాట్నా – హౌరా
కాసరగోడ్ – తిరువనంతపురం
రూర్కెలా – భువనేశ్వర్ – పూరి
రాంచీ – హౌరా
జామ్‌నగర్-అహ్మదాబాద్

 

కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలు 

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలును ప్రారంభించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే రైల్వేశాఖ నూతన శకం ప్రారంభమైందన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో వందే భారత్‌ రైలు కాచిగూడ, బెంగళూరు ప్రారంభమైంది. మూడు రాష్ట్రాలు, 12 జిల్లాలకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఈ రైలు ఉంటుంది. తెలంగాణలో ప్రారంభమైన ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని కాచిగూడ-బెంగళూర్‌లోని యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో స్థానికంగా ఆగనుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్‌ కార్ కోచ్‌లు ఉంటాయి.

విజయవాడ – చెన్నై

విజయవాడ – చెన్నైల మధ్య వందేభారత్‌ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. చెన్నైలో ప్రధాని మోడీ ప్రారంభించిన రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గం గుండా వెళ్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది. 6:40 గంటల్లోనే విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణం పూర్తి కానుంది. టిక్కెట్‌ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. చైర్‌ కార్‌ టిక్కెట్ ధర రూ.1,420 నిర్ణయించగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధరను రూ.2,630గా నిర్ణయించారు.

రైల్వేలో ఆధునాతన ఫీచర్లను జోడించడంతో పాటు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు భారత్ రైల్వే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ప్రస్తుతం రూర్కెలా-భువనేశ్వర్, కాసర్ గోడ్-తిరువనంతపురం మార్గాల్లో ఇప్పుడున్న వేగవంతమైన రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ముందుగానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి.హైదరాబాద్-బెంగళూర్ మధ్య ప్రయాణ కాలాన్ని 2.5 గంటలు తగ్గిస్తుంది. తిరునెల్వెలి-మధురై-చెన్నై మధ్య 2 గంటల సమయం ఆదా అవుతుంది. పూరీ, భువనేవ్వర్, మధురై, తిరునల్వేలి, విజయవాడ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు మంచి కనెక్టివిటీ అందిస్తుంది.

 

Show comments