NTV Telugu Site icon

PM Narendra Modi: నాలుగో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

Vande Bharat

Vande Bharat

PM Narendra Modi: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది. బుధవారం మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్ పూర్ సాహిబ్, ఉనా రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. ఇది కేవలం 52 సెకన్లలో 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందుతుంది. సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని ఈ రైలు అందిస్తుంది. ఇది దేశంలో నాల్గవ వందే భారత్ రైలు, మిగిలిన మూడు న్యూ ఢిల్లీ – వారణాసి, న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, గాంధీనగర్-ముంబై మధ్య నడుస్తున్నాయి.

సెప్టెంబర్ 30న భారతదేశంలో మూడో వందేభారత్ రైలును ప్రధాని మోదీ గుజరాత్ గాంధీ నగర్‌లో ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది. సెమి హైస్పీడ్ ట్రైన్‌గా వందే భారత్ రైలును అభివృద్ధి చేశారు. వైఫై, 32 అంగుళాల ఎల్సీడీ టీవీలు, ఆల్ట్రావయోలెట్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్స్ వంటి సేవలు ఈ వందే భారత్ రైలులో ఉన్నాయి.

మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-వారణాసిల మధ్య ప్రారంభించారు. రెండో వందే భారత్ రైలును ఢిల్లీ- శ్రీ వైష్ణోదేవి మాతా, కత్రా మధ్య ప్రవేశపెట్టారు. మూడోది గాంధీనగర్-ముంబైల మధ్య, నాలుగో రైలు ఢిల్లీ- అంబ్ అందౌరా మధ్య ప్రయాణించనుంది. ఆగస్ట్ 15, 2023 లోపు 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే శాఖ. అయితే ఇటీవల వందే భారత్ రైళ్లకు వరసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గాంధీనగర్- ముంబై మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలు అహ్మదాబాద్ స్టేషన్ సమీపంలో గేదెలను ఢీకొట్టింది. దీంతో ముందు భాగంలో రక్షణగా ఉండే షీల్డ్ దెబ్బతింది. ఆ తరువాత కూడా మరో రెండు ప్రమాదాలు జరిగాయి.

Elephant Enjoying Panipuri: పానీపూరీలు ఇష్టంగా లాగించిన గజేంద్రుడు.. వీడియో వైరల్

హిమాచల్‌ ప్రదేశ్ పర్యటనలో భాగంగా.. ఇవాళ ప్రధానమంత్రి ఐఐఐటీ ఉనాను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చంబాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో, ప్రధానమంత్రి హిమాచల్ ప్రదేశ్‌లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)-IIIని ప్రారంభిస్తారని బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటన ద్వారా తెలిసింది. ఉనా జిల్లాలోని హరోలిలో 1900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బల్క్ డ్రగ్ పార్క్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 3125 కి.మీ రోడ్ల అప్‌గ్రేడేషన్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)-IIIని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 15 సరిహద్దులు, సుదూర బ్లాకుల్లో 440 కిలోమీటర్ల మేర రోడ్ల అప్‌గ్రేడేషన్ కోసం ఈ దశలో కేంద్ర ప్రభుత్వం రూ.420 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.

Show comments