PM Modi Tour: నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నన్నూరు సమీపంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో ప్రధాని మోడీ భారీ బహిరంగసభ కొనసాగనుంది. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ ఏర్పాటు చేయనున్నారు. 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు, 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, వేదిక ఉండనుంది. జన సమీకరణకు దాదాపుగా 7వేల బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,280 కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థ, రూ.4920 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి, రూ. 1200 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, గెయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన రూ. 1730 కోట్లతో శ్రీకాకుళం – అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్, కర్నూలు పిఎస్ – 3 వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.2,886 కోట్లతో అదనపు పవర్ గ్రేడ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు.
పూర్తి షెడ్యూల్..
ఉదయం 7:20కి ఢిల్లీ నుంచి బయలుదేరి 9:50కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. 9:55కి కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 10:35కి సుండిపెంట హెలిపాడ్‌కి చేరుకుంటారు. సుండిపెంట నుంచి రోడ్డు మార్గంలో 10:55కి శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుంటారు. ఉదయం 11:15 నుంచి 12: 05 వరకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. 12:10 నుంచి 12:35 వరకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శించుకుంటారు. 12:40 కి తిరిగి భ్రమరాంబ అతిథి గృహానికి వస్తారు. మధ్యాహ్నం 1:20కి భ్రమరాంబ అతిథి గృహం నుంచి బయల్దేరి సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకుని కర్నూలు బైల్దేరుతారు. మధ్యాహ్నం 2.20కి కర్నూలు హెలిపాడ్ చేరుకుంటారు. 2.30 కి నన్నూరు సమీపంలోని రాగమయూరి వెంచర్ లో సభస్థలికి చేరుకోనున్నారు.
READ MORE: Naveen Reddy : మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డికి 6 నెలల నగర బహిష్కరణ
ట్రాఫిక్ ఆంక్షలు..
ప్రధాని పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. శ్రీశైలం-దోర్నాల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు. కర్నూలులో ఎన్ హెచ్ 40, ఎన్ హెచ్ 44 పై ట్రాఫిక్ మల్లింపు చేపడతారు. కర్నూలు మీదుగా వెళ్లే హైద్రాబాద్ -బెంగుళూరు, నంద్యాల, బళ్లారి, ఆత్మకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు దారి మళ్లిస్తారు. భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేస్తారు.
