NTV Telugu Site icon

Virat Kohli Tickets: ముందే చెబుతున్నా.. ప్రపంచకప్ 2023 టికెట్స్ ఎవరూ అడగొద్దు: కోహ్లీ

Virat Kohli

Virat Kohli

Virat Kohli Says Please Don’t Ask ICC Cricket World Cup 2023 Tickets: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గురువారం (అక్టోబర్ 5) నుంచి మెగా టోర్నీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరగనుంది. దాంతో క్రికెట్ ప్రపంచమంతా ప్రపంచకప్ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీ టికెట్స్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆటగాళ్లకు పెద్ద తల నొప్పిగా మారింది. బంధువులు, సన్నిహితుల నుంచి మ్యాచ్ టికెట్ల కోసం ఒత్తిడి పెరిగింది. ఈ బాధ నుంచి బయటపడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ చేశాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023కి సంబందించిన మ్యాచ్ టికెట్స్ తనను ఎవరూ అడగొద్దని సోషల్ మీడియా వేదికగా తన స్నేహితులు, బంధువులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ‘వన్డే ప్రపంచకప్‌కి సమయం ఆసన్నమైంది. టోర్నీ ముగిసే వరకు టికెట్ల కోసం నన్ను అభ్యర్థించవద్దని నా స్నేహితులందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఇంట్లో నుంచే మ్యాచ్‌లను ఎంజాయ్ చేయండి’ అని విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నాడు. ఓ ఫన్నీ ఏమోజీని కూడా జత చేశాడు.

Also Read: Asian Games 2023: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ కల సాధ్యమయ్యేనా?

2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌కి ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా కప్ కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌కి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై కప్ అందుకోవాలని చూస్తోంది. ఇక అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ మెగా టోర్నీ వేటను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.