Site icon NTV Telugu

Hacking: ఆస్పత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5 లక్షల మంది రోగుల డేటా ఆన్‌లైన్‌లో విక్రయం

Hacking

Hacking

Hacking: ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్స్ హ్యాకింగ్ వ్యవహారం తేలకముందే.. తమిళనాడులోని మరో ఆస్పత్రి సైబర్ దాడికి గురి కావడం గమనార్హం. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌లోని 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు ప్రముఖ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లు, డేటాబేస్‌లను విక్రయించడానికి ఉపయోగించే టెలిగ్రామ్ ఛానెల్‌లో విక్రయించారు. సైబర్ బెదిరింపులను అంచనా వేసే సంస్థ క్లౌడ్‌సెక్ దీనిని వెలుగులోకి తెచ్చింది. తమిళనాడు శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు చెందిన 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో విక్రయించబడినట్లు క్లౌడ్‌సెక్ తెలిపింది. 2007-2011 మధ్య ఈ ఆసుపత్రికి వెళ్లిన రోగుల పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, గార్డియన్‌ పేరు, వైద్యుల వివరాలను సైబర్‌ నేరగాళ్లు విక్రయించినట్లు వెల్లడించింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు తెలిసింది. ‘థ్రీ క్యూ ఐటీ ల్యాబ్‌’ అనే థర్డ్‌ పార్టీ వెండర్‌ నుంచి ఈ డేటాను చోరీ చేసినట్లు క్లౌడ్‌సెక్‌ పేర్కొంది.

క్లౌడ్‌సెక్ పరిశోధకులు శాంపిల్‌లో ఉన్న ఆరోగ్య సంరక్షణ సంస్థను గుర్తించడానికి డేటాబేస్‌లోని వైద్యుల పేర్లను ఉపయోగించారు. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు పనిచేస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ సందర్భంలో త్రీ క్యూబ్ ఐటి ల్యాబ్‌ను మొదట లక్ష్యంగా చేసుకున్నారని.. అక్కడి నుంచి ఆసుపత్రి డేటాను దొంగలించి ఉంటారని క్లౌడ్‌సెక్‌ కంపెనీకి చెందిన అనలిస్ట్‌ ఒకరు చెప్పారు. దీనిని సప్లె చైన్ అటాక్‌గా పేర్కొనవచ్చన్నారు.

Navy Chief: 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా భారత నావికాదళం.. తొలిసారిగా నేవీలో మహిళా నావికులు

ఇటీవల ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డబ్బులను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎయిమ్స్‌ ప్రధాన సర్వర్ 23 బుధవారం నాడు హ్యాక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సర్వర్‌లో దాదాపు 3-4 కోట్ల మంది రోగుల డాటా ఉన్నట్లు సమాచారం. సర్వర్‌ డౌన్‌ కావడంతో ఎమర్జెన్సీ ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, లేబొరేటరీ విభాగాల్లో పేషెంట్‌ కేర్‌ సేవలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. కంప్యూటర్లలో రాన్సమ్ వేర్‌ను చొప్పించి, ఆ కంప్యూటర్లను పనిచేయకుండా చేశారు. తమకు రూ.200 కోట్ల క్రిప్టోకరెన్సీ చెల్లిస్తేనే సర్వర్లను తిరిగి పనిచేసేలా చేస్తామని డిమాండ్ చేశారు.

Exit mobile version