NTV Telugu Site icon

Road Accident: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ ఉండగానే కోళ్ల‌ను ఎత్తుకెళ్లిన జ‌నాలు! వీడియో వైరల్

Road Accident Chickens Agra

Road Accident Chickens Agra

Truck Carrying Chickens Gets Accident in Agra: బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ప‌లు వాహ‌నాలు ఢీకొన్నాయి. ఢీకొన్న వాహ‌నాల్లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్ర‌క్కు కూడా ఉంది. ఇది గ‌మ‌నించిన వాహ‌న‌దారులు, స్థానికులు ట్ర‌క్కులో ఉన్న కోళ్ల‌ను తాళాలు పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. కొందరు నాలుగైదు కోళ్లను చేతిలో పట్టుకుని పారిపోగా.. ఇంకొంద‌రైతే ఏకంగా సంచుల్లో వేసుకుని వెళ్లిపోయారు. కోళ్ల‌ను ఎత్తుకెళ్ల‌కుండా జనాలను ట్ర‌క్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

బుధవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పలు ప్రాంతాల్లో 50 మీటర్ల మేర ఏమీ కనిపించలేదు. జర్నా నాలా సమీపంలో దట్టమైన పొగమంచు కారణంగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ప్ర‌మాదానికి గురైన వాహ‌నాల్లో కోళ్ల‌ను త‌ర‌లిస్తున్న ట్ర‌క్కు కూడా ఉంది. గాయపడిన ట్ర‌క్కు డ్రైవర్ సునీల్ కుమార్ సహాయం కోసం కేకలు వేయడంతో.. ట్ర‌క్కులో కోళ్లను గ‌మ‌నించిన వాహ‌న‌దారులు, స్థానికులు ఎగ‌బ‌డి ఎత్తుకెళ్లారు.

Also Read: IND vs SA: అతడు లేడు.. భారత్ టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం!

‘ఆగ్రా నుంచి కాస్గంజ్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. పొగ‌మంచు కార‌ణంగానే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కోళ్ల‌ను ఎత్తుకెళ్తున్న వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించినా ఫలితంలేకుండా పోయింది. మొదట్లో అడ్డుకునే ప్రయత్నం చేసినా.. జనం పెరగడంతో ఏమీ చేయలేకపోయా. రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయి. నాకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది’ అని ట్ర‌క్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు.