NTV Telugu Site icon

Pendurthy Ysrcp… Off The Record: పెందుర్తిలో పంచాయతీ.. పట్టు ఎవరిది?

Pendurti

Pendurti

చలికాలంలోనూ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి రాజకీయ ఉక్కపోత తప్పడం లేదు. ప్రతిపక్షం కంటే సొంతపార్టీ నేతలు పెట్టే సెగ ఎక్కువైందని టాక్. జరిగే నష్టం పసిగట్టిన శాసనసభ్యుడు.. తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. టికెట్‌ కోసం పోటీ పెరగడంతో రచ్చరచ్చ అవుతోంది. ఆ నియోజకవర్గం ఏంటో.. ఆ పేచీలేంటో.. ఈ స్టోరీలో చూద్దాం.

మార్పుల జాబితాలో పెందుర్తి ఉందని ప్రచారం
ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీలో అనూహ్యమైన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీటు గ్యారెంటీ లేదనే గట్టి ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య పెరిగి.. శాసనసభ్యులకు కలవరం ఎక్కువైంది. మార్పుల జాబితాలో పెందుర్తి ఉందనే ప్రచారంతో వాతావరణం హాట్ హాట్‌గా మారుతోంది. ఈ నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్‌ తక్కువేం కాదు. సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల పరిధిలో విస్తరించిన ఈ సెగ్మెంట్‌లో కాపు, వెలమ, గవర సామాజికవర్గాలు బలమైనవి. గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి కూడా. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్‌రాజు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాలకు జూనియర్‌ కావడం వల్లో ఏమో.. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పెందుర్తిపై పట్టు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు అదీప్‌రాజు. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది.

మంత్రి అమర్నాథ్‌ పేరు చుట్టూ చర్చ
నియోజకవర్గంలో వైసీపీ సీనియర్‌ నేత శరగడం చిన అప్పలనాయుడుతో అదీప్‌రాజుకు పొసగడం లేదు. తాజాగా పెందుర్తిలో అభ్యర్థిని మార్చేస్తారనే ప్రచారం ఎక్కువై.. రేస్‌లోకి మరికొందరు సీనియర్లు వస్తున్నారు. ఆ పోటీ ఎమ్మెల్యేను మరింత కలవర పెడుతోందట. ఇటీవల వైసీపీ నగర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబును నియమించారు. వచ్చే ఎన్నికల్లో పంచకర్లకే టికెట్‌ వస్తుందనే వాదన కేడర్‌లో ఉంది. 2009లో పెందుర్తి నుంచి ఆయన పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌, టీడీపీ శ్రేణులతోనూ ఆయనకు సంబంధాలు ఉండటం.. వాటిని ఇటీవల కాలంలో యాక్టివేట్‌ చేస్తుండటంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెండోసారి బరిలో దిగేందుకు అదీప్‌రాజు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అప్పలనాయుడు, పంచకర్ల దూకుడుతో పెందుర్తి వైసీపీలో పేచీ మరో లెవల్‌కు చేరుకుంది. కొత్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేరు కూడా చర్చల్లోకి రావడంతో హీట్‌ మరింత పెరుగుతోంది.

ఓ మాజీ మంత్రి సర్వే చేయిస్తున్నారా?
వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అమర్నాథ్‌ మళ్లీ పోటీ చేయబోరనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే పెందుర్తి వైపు మంత్రి మొగ్గు చూపుతారని సన్నిహితుల వాదన. దీనిపై అమర్నాథ్‌ కానీ.. ఆయన అనుచరులు కానీ బయట పడలేదు. కాకపోతే పెందుర్తి ఆప్షన్‌ను కచ్చితంగా పరిశీలిస్తారనే చర్చ జరుగుతోంది. ఓ మాజీ మంత్రి కూడా ఇక్కడ సర్వేలు చేయించుకున్నట్టు సమాచారం. ప్రతి ఎన్నికల్లోనూ తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పోటీ చేస్తారు ఆ మాజీ మంత్రి. అయితే వీళ్లందరిలో పంచకర్ల పేరే బలంగా వినిపిస్తోందని కేడర్‌ చెబుతోంది. పంచకర్ల 2009లో పెందుర్తి.. 2014లో యలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఇటీవల పార్టీ జిల్లా పగ్గాలు కూడా అప్పగించడంతో పెందుర్తిలో స్పీడ్‌ పెంచారు ఈ మాజీ ఎమ్మెల్యే. పైగా టికెట్‌ విషయంలో అంతా సహకరించాలని ఆయన కోరుతున్నారట.

ఎమ్మెల్యే అదీప్‌రాజు ఆలస్యంగా అప్రమత్తం..!
రంగులు మారుతున్న రాజకీయంతో ఎమ్మెల్యే అదీప్‌రాజు ఆలస్యంగా అప్రమత్తం అయ్యారట. మొన్నటి వరకు అందరితో టచ్‌ మీ నాట్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు అందరినీ కలుపుకొని వెళ్తూ కార్యక్రమాలు చేపడుతున్నారట. పంచకర్లకు బ్రేక్‌లు వేసేందుకు పెందుర్తిలోని వైసీపీ ముఖ్య నాయకులు, అనుచరులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు అదీప్‌రాజు. మైనస్సులను ప్లస్సులుగా మార్చుకునేందుకు తెగ శ్రమిస్తున్నారట ఎమ్మెల్యే. మరి.. పెందుర్తి సీటు పేచీ రానున్న రోజుల్లో ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.