పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్ల లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరుకు పోయిన ధాన్యాన్ని వేలం వేయడానికి పిలిచిన టెండర్లలో జరిగిన అక్రమాల్లో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇందులో వాటాలు వెళ్లాయని, మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సేకరణ కు పిలిచిన తాజా టెండర్లలోనూ చేతి వాటం ప్రదర్శించారని ఆయన మండిపడ్డారు.
సన్న బియ్యం కిలో రేటు ను బహిరంగ మార్కెట్ కన్నా అధికంగా నిర్ణయించారని, దాదాపు 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేవిధంగా టెండర్లు ఉన్నాయన్నారు. దాదాపు 57 రూపాయలకు కిలో చొప్పున సన్న బియ్యం కొనేలా టెండర్లు ఇచ్చారని, రైస్ మిల్లర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించిన నాలుగు సంస్థలకు లబ్ది చేకూరేలా కాంగ్రెస్ పెద్దలు టెండర్ల ను రింగ్ చేశారని, రేవంత్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పౌరసరఫరాల శాఖలోనే వెయ్యి కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందన్నారు. టెండర్ల అక్రమాల పై సోమవారం బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన సీ ఎస్ కు పిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు.