జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బోడ యశ్వంత్‌ను పాముకాటేసింది. స్కూల్ ప్రిన్సిపల్.. యశ్వంత్‌ను హుటాహుటిన కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం అదే పాఠశాలలో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. తాజా ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ ఈరోజు నిద్ర లేచేసరికి కాలుకు గాయమై.. దురదలు వచ్చాయి. అతడు విషయాన్ని ప్రిన్సిపల్ మేడంకు చెప్పాడు. అప్రమత్తమైన ప్రిన్సిపల్.. విద్యార్ధి యశ్వంత్‌ను చికిత్స నిమిత్తం కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ టెస్టులు చేయగా.. పాము కాటేసిందని తేలింది. వైద్యులు చికిత్స అందించారు. నిన్న 8వ తరగతి విద్యార్థి అఖిల్ చేతికి విష పురుగు కాటేయగా..చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు విద్యార్థులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. పాఠశాలలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే పాఠశాలలో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.