Site icon NTV Telugu

Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!

Rajat Patidar

Rajat Patidar

ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ అభిమానులకు పిలుపునిచ్చాడు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీపై ఆదరణ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని, స్పిన్నర్ సుయాశ్‌ శర్మ బౌలింగ్‌ అద్భుతం అని పాటీదార్ ప్రశంసించాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ… ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో మా ప్రణాళికలు, ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారు. బాగా బౌలింగ్ చేశారు. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌ అద్భుతం. లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు బౌలింగ్ విధానం బాగుంది. ఓ కెప్టెన్‌గా సుయాశ్‌ ఎలా బౌలింగ్‌ చేస్తాడో నాకు అవగాహన ఉంది. వికెట్లను లక్ష్యంగా చేసుకొని బంతులు వేస్తాడు. అదే అతడి బలం. సుయాశ్‌ బౌలింగ్‌ను బ్యాటర్లు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటా. సుయాశ్‌ను కంగారు పెట్టడం ఇష్టం లేదు, కొన్నిసార్లు పరుగులు ఇచ్చినా మద్దతుగా ఉంటా’ అని చెప్పాడు.

‘టోర్నమెంట్ అంతటా మేము చాలా ప్రాక్టీస్ చేసాము. ప్రతి మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం బాగుంటుంది. సాల్ట్ శుభారంభం గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. నేను అతడికి పెద్ద అభిమానిని. డగౌట్ నుండి సాల్ట్ బ్యాటింగ్ చూడడం బాగుంటుంది. ఆర్సీబీ అభిమానులకు మా కృతజ్ఞతలు. చిన్నస్వామి స్టేడియమే కాదు మేము ఎక్కడ ఆడినా దాన్ని మా హోమ్ గ్రౌండ్ లానే భావిస్తాము. మాకు ఎంతో మద్దతు ఇస్తారు. ఇంకా ఒకే ఒక్క మ్యాచ్‌ మిగిలి ఉంది. కలిసి సంబరాలు చేసుకుందాం. సిద్ధంగా ఉండండి’ అని రజత్ పాటీదార్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version