Site icon NTV Telugu

Pawan Kalyan: నేను ఓడిపోయినప్పుడు నా భుజం తట్టిన వ్యక్తి జస్టిస్ వి. గోపాల గౌడ..

Pwawan

Pwawan

Pawan Kalyan: కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, అది అతని గౌరవం, భద్రత అని జస్టిస్ వి. గోపాల గౌడ నిరూపించారు. కార్మికుడికి రక్షణ, ఒక హైకోర్టు తీర్పుని కొట్టివేస్తూ, కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ తప్పనిసరి అని తీర్పునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా కర్ణాటక, చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో జస్టిస్ వి.గోపాల గౌడ అమృత మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించారు. ప్రజలకు జీవించే హక్కు అంటే జీవనోపాధి పొందడం అని ప్రభుత్వాలకు చాలా సున్నితంగా హెచ్చరించారని గుర్తు చేశారు. ప్రత్యేకించి జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆయన చాలా బలమైన మద్దతుదారుడని చెప్పారు. జస్టిస్ వి. గోపాల గౌడ అంటే కేవలం మాజీ సుప్రీంకోర్టు న్యాయవాది అనే కాదు, నేటికి పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా, రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళం ఎత్తుతున్న ఒక నిత్య పోరాట యోధుడని కొనియాడారు. జస్టిస్ వి. గోపాల గౌడ జనసేన సిద్ధాంతాలను, విలువలను ఎంతో గౌరవిస్తారన్నారు. అందుకే చాలా పరిస్థితుల్లో మేము చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొన్నారని తెలిపారు.

READ MORE: Naga Chaitanya: ‘మహానటి’లో తాతయ్య పాత్ర తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశా..

భూ సేకరణ చట్టంపై, నల్లమల యురేనియం తవ్వకాలపై కావొచ్చు అలాంటి సమావేశాల్లో ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలంగా మారిందని పవన్ కల్యాణ్ తెలిపారు. “గత ప్రభుత్వంలో రాజధానుల ఆలోచనపై న్యాయ పరమైన అంశాలను చాలా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా వారు చెప్పారు. యువ న్యాయవాదులకు, ప్రజా నాయకత్వానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు. నేను ఉపముఖ్యమంత్రి అయిన తరువాత వారు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి మహానుభావుల పరిచయం, సహకారం జనసేన పార్టీకి పెద్ద అండ. నాకు వ్యక్తిగతంగా కాదు.. మన బిడ్డల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం. నేను రాజకీయాల్లోకి వచ్చి మొదటి ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు మంచి రోజులు వస్తాయ్ అని చెప్పిన వ్యక్తి జస్టిస్ వి. గోపాల గౌడ.” అని పవన్ వ్యాఖ్యానించారు.

Exit mobile version