Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యేగా బాలరాజు పని తీరుపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ దృష్టికి వచ్చిన పలు అంశాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను వివరణ కోరినట్లు సమాచారం. ఇంకా తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చక్కదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే బాలరాజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ను కోరారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, నాలుగు వారాల్లోగా అన్ని వ్యక్తిగత వ్యవహారాలను సరిచేసుకోవాలని గడువు ఇచ్చినట్లు తెలిసింది.

ఇక పోలవరం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల అభివృద్ధి పనులపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటివరకు అభివృద్ధి పనుల కోసం రూ.147 కోట్లు కేటాయించినట్లు పేర్కొంటూ, ఆ పనుల పురోగతిపై అధికారులతో పాటు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ముఖ్యంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

దీనికి స్పందించిన ఎమ్మెల్యే బాలరాజు.. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని తెలిపారు. అలాగే వ్యక్తిగత వ్యవహారాలను కూడా త్వరలోనే చక్కదిద్దుకుంటానని హామీ ఇచ్చారు. వ్యక్తిగత అంశాలను సరిచేసుకునేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.